వలస బాట..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:30 PM
పట్టణంలోని వీకే నగర్‌కు చెందిన 20 కుటుంబాలు పిల్లా పాపలతో గురువారం వలస వెళ్లారు. సంక్రాంతి పండుగ చేసుకుని, ఇక వలస బాట పట్టారు. ఇక్కడ పనులు లేవని, దీతో పొట్ట చేతపట్టుకుని గుంటూరుకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు.

పత్తికొండ నుంచి గుంటూరుకు బయలుదేరిన 20 కుటుంబాలు
స్థానికంగా ఉపాధి లేకపోవడంతో తప్పలేదని ఆవేదన
తల్లిదండ్రులతోపాటు విద్యార్థులూ... ప్రశ్నార్థకంగా వారి భవిష్యత్తు
పత్తికొండ టౌన్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీకే నగర్‌కు చెందిన 20 కుటుంబాలు పిల్లా పాపలతో గురువారం వలస వెళ్లారు. సంక్రాంతి పండుగ చేసుకుని, ఇక వలస బాట పట్టారు. ఇక్కడ పనులు లేవని, దీతో పొట్ట చేతపట్టుకుని గుంటూరుకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. కూలీలతో పాటు వారి పిల్లలను కూడా తీసుకెళుతుండటంతో వారు బడికి దూరమయ్యారు. దీంతో చిన్నారుల చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యార్థుల చదువు దెబ్బతినకుండా సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చెయ్యాలి. అయితే పత్తికొండలో ఎక్కడా సీజనల్ హాస్టళ్లు లేకపోవడంతో పిల్లల చదువు ఆగిపోతుంది. అధికారులు స్పందించి ఉపాధి కల్పించాలని, సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు.
ఇక్కడ పనులు లేవు
ఉన్న ఊరిలో వ్యవసాయ పనులు ముగిసిపో యాయి. దీంతో పనులు లేక పిల్లా పాపలతో గుంటూరులోని పొలాల్లో మిరప కోసేందుకు వెళ్తున్నాం. ఏటా ఇలా వలస వెళ్లడం మాకు పరిపాటి. - హుశేనమ్మ, కూలీ, వీకే నగర్, పత్తికొండ
ఉపాధి పనులు లేవు
ఇంత వరకు ఉపాధి పనులు ప్రారంభించ లేదు. ఇప్పటి వరకు కుటుంబ మంతా వ్యవసాయ పనులకు వెళ్లేవారం. పొలాల్లో పనులు లేవు, దీంతో గుంటూరుకు వెళ్తున్నాం. - సరోజమ్మ, కూలీ, వీకే నగర్, పత్తికొండ
చదువు మానేసి వెళుతున్నా
నేను పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. అమ్మ, నాన్న, అందరూ వలస వెళుతున్నారు. ఇక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పలేదు. దీంతో చదువు మానేసి వెళుతున్నా. - యువరాజు, 7వ తరగతి