Share News

మహా శివరాత్రి ఏర్పాట్లపై సమావేశం

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:52 PM

శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మహా శివరాత్రి ఏర్పాట్లపై సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో

శ్రీశైలం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రావు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహాకారంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి సంబంధిత విభాగాధిపతులతో కూలంకషంగా చర్చించి పలు సూచనలు జారీ చేశారు. వైదిక సిబ్బంది, ఆలయ విగాధిపతులు పరస్పర సమన్వయంతో ఉత్సవ కార్యక్రమాలు, స్వామి, అమ్మవార్ల కైంకర్యాలన్నీ ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఉత్సవాల్లో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర వాటిపై చర్చించారు. క్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు అటవీ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు, వసతి, వైద్య సదుపాయం, క్షేత్రపరిధిలో ట్రాఫిక్‌ నియంత్రణ, పారశుధ్య చర్యలు, శౌచాలయాల ఏర్పాట్లు, పాతాళగంగ వద్ద ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, సూచికబోర్డుల ఏర్పాటు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఈఓ ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:52 PM