మహాశివరాత్రికి ఏర్పాట్లు సిద్ధం చేయండి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:42 AM
మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలంలోని గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలంలోని గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దేవాదాయ, పోలీసు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురుజాల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శివ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత సౌకర్యంతోపాటు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్లను బాగు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు సమయపాలన పాటిస్తూ భక్తులకు సకాలంలో బస్సులు నడపాలన్నారు. అగ్నిమాపక అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నదీతీర ప్రాంతం కావునా గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. భక్తులు స్నానాలు చేసే సమయంలో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. అలాగే గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన సద్గురు బడేసాహెబ్ స్వామి ఉరుసు ఉత్సవానికి సైతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బస్సులను అధిక సంఖ్యలో నడపాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఉపేంద్రబాబు, గోనెగండ్ల, నందవరం ఎంపీడీవోలు, ఈవో రాంప్రసాద్, గురుజాల రామకృష్ణారెడ్డి, నాగరాజుగౌడు, ఖాశింవలి, కృష్ణమనాయుడు, నజీర్ పాల్గొన్నారు.