రైల్వే స్టేషన్లకు మహర్దశ
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:53 PM
రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు 2025-26 బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సోమవారం వెల్లడించారు.

ఇప్పటికే కర్నూలు సిటీ, ఆదోని స్టేషన్లలో పనులకు శ్రీకారం
వివిధ దశల్లో నిర్మాణాలు
మహబూబ్‌నగర్-డోన్ వయా కర్నూలు మధ్య డబ్లింగ్
ఉమ్మడి జిల్లాకు ఆశాజనకంగా నిధులు వచ్చే అవకాశం
బడ్జెట్ ముఖ్య అంశాలు వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కర్నూలు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు 2025-26 బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సోమవారం వెల్లడించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు ఇచ్చారో స్పష్టత ఇవ్వలేదు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎంపికైన జిల్లాలో కర్నూలు సిటీ, ఆదోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు ఇచ్చారు. మహబూబ్ నగర్-డోన్ వయా కర్నూలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణకు కూడా నిఽధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కర్నూలు నగరవాసుల చిరకాల స్వప్నమైన వెంకటరమణ కాలనీ వైపు రెండు ప్రధాన ద్వారం (సెంకెడ్ గేట్), మొదటి ప్రధాన ద్వారం (ఫస్ట్ గేట్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. తాజా బడ్జెట్‌లో ఆశాజనకంగా నిధులు కేటాయించడంతో పనులు వేగంగా జరుగుతాయని రైల్వే అధికారులు అంటున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేపట్టామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. అందులో కర్నూలు సిటీ, ఆదోని కూడా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో కర్నూలు ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వమే 1905లో ప్రారంభించారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన స్టేషన్ ఇది. 2013-14లో కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌గా మార్చారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద. రూ.42.6 కోట్లు మంజూరు చేశారు. 2023 ఆగస్టులో ప్రధాని మోదీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. రైల్వే స్టేషన్ వెనుకు వైపు వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్, లేబర్‌కాలనీ, సంతోష్ నగర్, బాలజీ నగర్, కప్పలనగర్.. వంటి కాలనీలు విస్తరిస్తున్నాయి. నగరం అటువైపు రోజురోజకు విస్తరిస్తుంది. ఆయా ప్రాంతాలకు చెందిన రైల్వే ప్రయాణికులు స్టేషన్‌కు రావాలంటే అశోక్‌నగర్ వద్ద నున్న రైల్వే లైన్ అండర్ బిడ్జి దిగువ నుంచి లేదంటే ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఐదు రోడ్ల కూడలి మీదుగా రావాలి. వర్షం వస్తే రైల్వే లైన్ అండర్ బిడ్జిలో వర్షపు నీరు నిండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటరమణ కాలనీ వైపు ఓ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు ఎన్నో ఏళ్లుగా విన్నవిస్తున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా సెకండ్ ఎంట్రీ గేట్ ఏర్పాటు చేస్తున్నారు. పునరుద్ధరణ పనుల్లో ఇది ఎంతో కీలకమైనది. ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో రెండో ద్వారం నిర్మాణం పనులు మొదలు పెట్టారు. అలాగే రెండో ముంబాయిగా ఖ్యాతిగాంచిన ఆదోని రైల్వే స్షేషన్‌కు ఎంతో చరిత్ర ఉంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేసి రూ.11.50 కోట్లతో పనులు మొదలు పెట్టారు. తాజాగా బడ్జెట్‌లో నిధులు ఇవ్వడంతో ఈ పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబ్లింగ్‌కు పచ్చజెండా
మహాబూబ్‌నగర్ - డోన్ వయా గద్వాల, కర్నూలు, వెల్దుర్తి 197 కి.మీల డబ్లింగ్ రైల్వే లైన్ నిర్మాణం, విద్యుద్ధీకరణ చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది నవంబరులో రూ.2,208 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ విశాఖ కేంద్రంగా వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ మార్గం నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో 54 కి.మీలు, తెలంగాణ రాష్ట్రం మహాబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో 143 కిలోమీటర్ల డబ్లింగ్ రైలు మార్గం నిర్మించనున్నారు. తాజా బడ్జెట్‌లో అవసరమైన మేరకు నిధులు కేటాయింపులు చేశారని అధికారులు తెలిపారు.