Share News

సీజనల్‌ దోపిడీపై లోకాయుక్త సీరియస్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:10 AM

జిల్లాలో సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ పేరిట సాగుతున్న అక్రమాల పర్వంపై ఆంధ్రజ్యోతి ‘సీజనల్‌ దోపిడీ’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన కథనంపై ఏపీ లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది.

సీజనల్‌ దోపిడీపై లోకాయుక్త సీరియస్‌

ఆంధ్రజ్యోతి బృందం తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు

పేద విద్యార్థుల కడుపు కొడుతున్న సిబ్బంది

ఇష్టారాజ్యంగా సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ

సుమోటోగా ఏపీ లోకాయుక్త కేసు నమోదు

ఏప్రిల్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ

కర్నూలు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ పేరిట సాగుతున్న అక్రమాల పర్వంపై ఆంధ్రజ్యోతి ‘సీజనల్‌ దోపిడీ’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన కథనంపై ఏపీ లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసింది. కన్నవాళ్లు వలస వెళితే.. విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకూడదని, వారికి రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంగా సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జరుగతున్న అక్రమాలపై విచారణ చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర నివేదిక ఏప్రిల్‌ 4లోగా ఇవ్వాలని సమగ్రశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌, విద్యా శాఖ కమిషనర్‌ సహా సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ మంగళవారం ఏపీ ఉప లోకాయుక్త పి. రజని ఆదేశాలు జారీ చేశారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటికే దాదాపు 2.50 లక్షల కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ప్రాంతాల్లో పత్తితీత, మిరప కోత పనులకు వలసలు వెళ్లాయి. కన్నవాళ్లతో పాటు చదుకునే విద్యార్థులు కూడా వలస వెళ్తుండడంతో బడిలో హాజరు శాతం తగ్గిపోతోంది. అమ్మనాన్నలు వలస వెళ్లినా.. పేద విద్యార్థులకు రోజూ మూడు పూటల ఆకలి తీర్చి, చదువుకొనేలా చూడాలని, బడిలో హాజరు శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 35 కాలానుగుణ వసతి కేంద్రాలు (సీజనల్‌ హాస్టళ్లు) ఏర్పాటు చేసింది. ఒక్కో హాస్టల్‌లో 50 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించింది. ఒక్కొ విద్యార్థికి రూ.1,000, కేర్‌ టేకర్‌, ట్యూటర్‌, ఇద్దరు వంట మనుషులు రూ.30 వేలు జీతం చొప్పున ఒక్కో సీజనల్‌ హాస్టల్‌కు రూ.80 వేలు చొప్పున ప్రతి నెల రూ.28 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. సమగ్రశిక్షా అభియాన్‌, విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగే ఈ సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ ఏజెన్సీ బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు, గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లకు అప్పగించారు. నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారా..? విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్నారా లేదా..? కేర్‌ టేకర్లు, ట్యూటర్లు ఉన్నారా..? అనే సమస్యలపై మండల విద్యా శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎంఈవోలు, జిల్లా అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడంతో ఈ సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. పేద విద్యార్థుల కడుపు కొడుతూ కాసుల కక్కుర్తిలో సీజనల్‌ హాస్టళ్లను దోపిడీ కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణులు వెల్లువెత్తున్నాయి. ఆదివారం జిల్లాలో పలు కేంద్రాలను ఆంధ్రజ్యోతి బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వెలుగు చూసిన వాస్తవాలను ‘సీజనల్‌ దోపిడీ’ శీర్షికన ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.

ఏపీ లోకాయుక్త సీరియస్‌

ఊళ్లో పనులు లేక దేశంలోని వివిధ ప్రాంతాలకు తాత్కాలిక వలస వెళ్లిన కూలీల పిల్లల చదువులకు అంతరాయం ఉండకూడదని ప్రభుత్వం భావించింది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించి ఆకలి తీర్చాలనే లక్ష్యంగా సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేసింది. ఆ హాస్టళ్లను సమగ్రశిక్షా అభియాన్‌, విద్యా శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అయినా.. హాస్టళ్ల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిలో ‘సీజనల్‌ దోపిడీ’ శీర్షిక వచ్చిన కథనంపై ఏపీ ఉప లోకాయుక్త పి. రజని సీరియస్‌గా స్పందించారు. ఫిర్యాదు నంబరు.486/2025/బీ2 కింద సుమోటోగా స్వీకరించారు. నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని, మంజూరు సంఖ్య కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారని, హాజరు రిజిస్టర్‌లో ఎక్కువ శాతం చూపించారని, అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయని, తనిఖీ చేసినా మార్పు రావడం లేదనే వాటిని ఆమె తీవ్రంగా పరిగణించారు. సీజనల్‌ హాస్టళ్లను తనిఖీ చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరిస్తూ సమగ్ర నివేదిక ఏప్రిల్‌ 4లో ఇవ్వాలంటూ సమగ్రశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌, విద్యా శాఖ కమిషనర్లకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను ఉప లోకాయుక్త పి. రజని జారీ చేశారు. సీజనల్‌ హాస్టళ్లలో ప్రతి రోజు మొత్తం విద్యార్థులు హాజరు అవ్వాలి. ఆహార నాణ్యత, ప్రమాణాలు ప్రకారం స్థిరమైన మెనూను పాటించాలి. ఎంఈవోలు వారంలో రెండు రోజులు తనిఖీ చేయాలి. అందుకు సబంధించిన ఫొటోలు సాక్ష్యాలతో నివేదిక ఇవ్వాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) నెలలో కనీసం ఒకసారైనా తనిఖీ చేయాలి. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇప్పటికైనా సీజనల్‌ హాస్టళ్ల నిర్వాహకులు స్పందించి పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డిస్తారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:10 AM