Share News

కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:21 AM

ప్రభుత్వం మద్యం షాపుల్లో కల్లు గీత కార్మికులకు పది శాతం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 335 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు
టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు

జిల్లాలో పది శాతం దుకాణాలను కేటాయించిన ప్రభుత్వం

27 నుంచి టెండర్‌ దరఖాస్తుల స్వీకరణ

నంద్యాల క్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మద్యం షాపుల్లో కల్లు గీత కార్మికులకు పది శాతం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 335 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో ఏ కులానికి ఎన్ని మద్యం షాపులు రానున్నాయన్న వివరాలను జిల్లా అధికారులు శుక్రవారం వెల్లడించారు. కలెక్టర్‌ బి.రాజకుమారి, డీఆర్వో రామునాయక్‌ ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ముస్తాక్‌ అహమ్మద్‌, ఎక్సైజ్‌ సీఐ కృష్ణమూర్తి, గీత కులాల ప్రతినిధుల సమక్షంలో షాప్‌ ఏ యూనిట్‌ (మున్సిపాలిటీ - మండలం)లో ఏ ఉప కులానికి వస్తుందో మాపింగ్‌ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెండర్లలో ఆయా కులాల వారీగా కేటాయింపులు చేశారు. ఆళ్లగడ్డ మద్యం షాపు గౌడ్‌ కులానికి కేటాయించారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో 3 మద్యం షాపులు గౌడ్‌ ఉప కులాలకు ఇచ్చారు. డోన్‌ సబ్‌ డివిజన్‌లో ఈడిగ ఉప కులాలకు 9 షాపులు ఇచ్చారు. నంద్యాల సబ్‌ డివిజన్‌లో 7 మద్యం షాపులను ఈడిగ ఉప కులాల వారికి ప్రకటించారు. నందికొట్కూరు ప్రాంతంలో ఈడిగ ఉప కులాలకు 10 షాపులు ఉంటాయని పేర్కొన్నారు. పాములపాడు మండలంలో ఈడిగ ఉప కులాలకు 8 షాపులు, జూపాడుబంగ్లా మండలంలో ఈడిగ ఉప కులాలకు 5 షాపులు కేటాయించారు. పగిడ్యాల మండలంలో గౌడ ఉప కులాలకు 11 మద్యం షాపులు ఉంటాయని చెప్పారు. డోన్‌ రూరల్‌లో ఈడిగ ఉప కులాలకు 6 షాపులు, కొత్తపల్లె మండలంలో గౌడ్‌ ఉప కులాలకు 2మద్యం షాపులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం మద్యం షాపుల్లో కల్లు గీత కార్మికులకు పది శాతం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చిన టెండర్లను ఫిబ్రవరి 7వ తేదీన ఓపెన్‌ చేసి మద్యం దుకాణదారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత గల ఆయా కులాల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jan 25 , 2025 | 12:21 AM