Share News

‘మత్తు’తో జీవితం చిత్తు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:42 AM

: మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

‘మత్తు’తో జీవితం చిత్తు
నందికొట్కూరులో ప్రతిజ్ఞ చేస్తున్న ఎంపీ శబరి, ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో విద్యార్థులు, అధికారుల సమ క్షంలో మాదకద్రవ్యానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజలు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత అలవాటు పడకుండా ఉంటేనే తమ భవిష్యత్తు బాగుంటుందని, బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అన్నారు. అనంతరం పటేల్‌ సెంటర్‌ వద్ద విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నంద్యాల ఎడ్యుకేషన్‌: మత్తు మానవత్వాన్ని మింగేస్తుందని, మత్తుతో జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ విభాగం సభ్యులు విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీసీపీఎస్‌ సభ్యులు నాగజ్యోతి, ఓబులమ్మ, లక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం చంద్రలేఖ మాట్లాడుతూ సమాజంలో మత్తు వ్యసనం రోజురోజుకు పెరుగుతోందని, మత్తు వ్యక్తిని శారీరకంగా, మానసికంగా కుంగదీయడంతో పాటు ఆర్థికంగా నష్టపరుస్తుందని అన్నారు. వ్యవసనాలకు బానిస కావొద్దని సూచించారు. అనంతరం విద్యార్థినుల చేత ప్రమాణం చేయించారు.

ఆత్మకూరు: డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించుకుందామని, ఇందుకోసం ప్రజలందరూ సంఘటితంగా కృషిచేయాలని ఆత్మకూరు తహసీల్దార్‌ రత్నరాధిక, అర్బన్‌ సీఐ రాము, ఎక్సైజ్‌ సీఐ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో విద్యార్థుల కలిసి పాతబస్టాండ్‌ నుంచి గౌడ్‌సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. వారు మాట్లాడుతూ ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగితే డయల్‌ 100 లేదా టోల్‌ ఫ్రీ 14405 సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌ నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ జగదీష్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుంకన్న తదితరులు ఉన్నారు.

మహానంది: యువత మేలుకో భవితను మలుచుకో డ్రగ్స్‌ను వదులకో అనే నినాదంతో ఎం.తిమ్మాపురంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహించారు ఎంపీడీవో మహమ్మద్‌ దౌలా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నసా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్‌, వీఆర్వో సురేంద్రనాఽథ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పాణ్యం: మాదకద్రవ్యాలతో బంగారు భవిషత్తు నాశనం చేసుకుంటున్నారని, మాదకద్రవ్యాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పాణ్యం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐలు నరేంద్ర కుమార్‌ రెడ్డి, నాగార్జునరెడ్డి, తహసీల్దారు నరేంద్రనాథ్‌ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంఈవో సుబ్రహ్మణ్యం, టి.చంద్రయ్య ప్రభుత్వ జూనియర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:42 AM