స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:33 PM
స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా జిల్లాను స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.

ప్రజల సహకారంతో విజయవంతం చేయండి
కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే దస్తగిరి
గూడూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా జిల్లాను స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం గూడూరు నగర పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్‌కు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి నెలా 3వ శనివారం న్యూ ఇయర్- క్లీన్ స్టార్ట్ అన్న థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్‌ను నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలో 484 గ్రామ పంచాయతీల్లో నాలుగు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రజల సహకారం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్రం, జిల్లాలు, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రభుత్వవం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామ ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్, ఎమ్మెల్యే అన్న క్యాంటీన్ ఆవరణలో మొక్కలు నాటారు. పాత మార్కెట్ ప్రాంతంలో ఉన్న చెత్తా చెదారాన్ని పొరకలు పట్టి శుభ్రం చేశారు. అంతకుముందు అంబేడ్కర్ సర్కిల్ నుంచి అన్న క్యాంటీన్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్డీవో సందీప్ కుమార్, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీపీవో భాస్కర్ జడ్పీ సీఈవో నాసరరెడ్డి, చైర్మన్ వెంకటే శ్వర్లు, వైస్ చైర్మన్లు అస్లాం, లక్ష్మన్న పాల్గొన్నారు.