శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దాం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:07 PM
కర్నూలును రాష్ట్రంలోనే శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ రంజిత్‌బాషా పిలుపునిచ్చారు.

కలెక్టర్ రంజిత్‌బాషా
గోనెగండ్ల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలును రాష్ట్రంలోనే శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ రంజిత్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం గోనెగండ్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్గమధ్యంలో లక్ష్మీపేట కాలనీలో కలెక్టర్ అధికారులతో కలసి చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఒక్కో ఽథీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చెత్తనుంచి కంపోస్టు, వర్మి కంపోస్టు ఎరువులను తయారు చేసి అమ్మకాలు జరిపి పంచాయతీకి ఆదాయం తీసుకురావాలన్నారు. గోనెగండ్ల గ్రామాన్ని సర్పంచ్ హైమావతి శుభ్రంగా ఉంచారని, ఆమెను అభినందించారు. అనంతరం క్లాస్ మిత్రలను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ఆ తర్వాత చెత్త నుంచి సంపద ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంలో పనిచేస్తున్న క్లాస్ మిత్రలకు సకాలంలో జీతాలు అందించాలని డీపీవో భాస్కర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జెడ్పీసీఈవో నాసరరెడ్డి, డీపీవో భాస్కర్, సర్పంచ్ హైమావతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో మణిమంజరి, కార్యదర్శి సతీష్, మలాంగ్, ఈవోఆర్‌డీ అనంతశయన, ఏవో బాబుభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
వచ్చే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా గాజులదిన్నె ఇరిగేషన్ డీఈ విజయకుమార్‌ను ఆదేశించారు. శనివారం ఆయన గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గాజులదిన్నె ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు నిలువ ఉన్నదీ, ప్రాజెక్టు కింద ఎన్ని తాగునీటి పథకాలు ఉన్నదీ, రోజుకు ఎన్ని క్యూసెక్కుల నీరు అవసరం అయ్యేదీ డీఈఈ అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎన్‌ఎస్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు ప్రస్తుతం రోజుకు ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుంది అని కలెక్టర్ ఆరా తీశారు. నీటి విడుదల ఏమైనా తగ్గితే తనకు తెలియజేయాలని డీఈఈ విజయ్ కుమర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ కళ్యాణి, జీడీపీ డీఈఈ విజయ్‌కుమార్, ఏఈ మహమ్మద్ అలీ, ఉగ్రనరసింహుడు, సిబ్బంది పాల్గొన్నారు.
పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే నిర్వహించాలి: కలెక్టర్
పొరపాట్లకు తావులేకుండా నియమ నిబంధనల ప్రకారం రీసర్వే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. రీసర్వే ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన గోనెగండ్ల మండలంలో శనివారం రీసర్వే జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రైతులు మునిస్వామి, పొట్టరవితో మాట్లాడుతూ రీ సర్వే జరిగే సమయంలో ఏమైన ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.