నులి పురుగులను తరిమేద్దాం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:56 PM
చిన్నారుల అనారోగ్యానికి కారణమయ్యే నులిపురుగులను ఆల్బెండజోల్ మాత్రలతో తరిమేద్దామని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు.

కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల అనారోగ్యానికి కారణమయ్యే నులిపురుగులను ఆల్బెండజోల్ మాత్రలతో తరిమేద్దామని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. సోమవారం మధ్యాహ్నం జాతీయ నులిపురుగుల నివారణ దినం పురస్కరించుకుని నగరంలోని ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్ హైస్కూల్‌లో కలెక్టర్, డీఎంహెచ్‌వో డా.పీ.శాంతికళతో కలిసి చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6.42 లక్షల మంది పిల్లలకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కింద ఆల్బెండజోల్ 400 మిల్లీ గ్రాములు మాత్రలను మింగిస్తున్నామన్నారు. ఎవరైనా ఈ నెల 10వ తేదీ ఆల్బెండజోల్ మాత్రలను మింగని పిల్లలకు ఈ నెల 17న మాప్ ఆప్ రౌండ్ ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామన్నారు. చిన్నపిల్లలు, బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులి పురుగులను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా మాత్రలను పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డా.శైలేష్ కుమార్, బుధవారపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డా.మాధవి, పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.