సెస్సు వసూలులో కర్నూలు టాప్
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:26 PM
కర్నూలు జిల్లా మార్కెట్ సెస్సు వసూలు రాయలసీమలో మొదటి స్థానంలో ఉందని మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు.

సీమలోని 74 మార్కెట్ కమిటీలకు రూ.133.16 కోట్ల సెస్సు వసూలు లక్ష్యం
ఇప్పటికే రూ.87.20 కోట్ల వసూలు
మార్చి నాటికి లక్ష్యాన్ని అధిగమించాలి
జేడీ రామాంజనేయులు
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 30: (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మార్కెట్ సెస్సు వసూలు రాయలసీమలో మొదటి స్థానంలో ఉందని మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు. గురువారం కర్నూలు మార్కెట్ యార్డులోని ఏడీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో మార్కెట్ ఫీజు వసూళ్లపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో రూ.35.14 కోట్ల సెస్సు లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.26.18 కోట్ల సెస్సు వసూలైందని అన్నారు. రెండో స్థానంలో నంద్యాల జిల్లా ఉందని, ఈ జిల్లాలో రూ.25.05 కోట్ల లక్ష్యానికి గాను రూ.15.42కోట్లు వసూలైందని జేడీ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల పంటల దిగుబడి బాగా ఉందని, కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలు అందుతున్నాయని అన్నారు. అందువల్ల మార్కెటింగ్ ఫీజు కూడా లక్ష్యానికి మించి వసూలవుతున్నదని అన్నారు. అనంతపురం జిల్లాలో రూ.12 కోట్ల సెస్సు వసూలుకు గాను రూ.7.75 కోట్లు ఇప్పటికి వసూలైందని అన్నారు. చిత్తూరు జిల్లాలో రూ.10.49 కోట్లకు గాను రూ.5.83 కోటు, కడప జిల్లాలో రూ.12.50 కోట్లకుగాను రూ.7.8 కోటు, తిరుపతి జిల్లాలో రూ.23.24 కోట్లకుగాను రూ.12.41 కోట్లు, అన్నమయ్య జిల్లాలో రూ.8.37 కోట్లకు గాను రూ.7.15 కోట్లు వసూలయ్యాయని అన్నారు. సత్యసాయి జిల్లాలో రూ.5.31 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.59 కోట్ల సెస్సు వసూలైందని అన్నారు. రాయలసీమలోని 74 మార్కెట్ కమిటీల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.133.16 కోట్ల సెస్సును వసూలు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించామని, డిసెంబరు నెలాఖరుకు రూ.87.20 కోట్లు వసూలైందని అన్నారు. ఈ సంవత్సరం మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే కోడుమూరు మార్కెట్ కమిటీ యార్డును ప్రారంభిస్తామని అన్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో కేంద్రం నిధులతో కోల్డ్ స్టోరేజీ ప్లాంటును నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.