కేఆర్‌ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:52 PM
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు కోరారు.
మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు కోరారు. ఆదివారం కర్నూలు విచ్చేసిన ఆయన ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నూలులో బోర్డు ఏర్పాటు వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ నదీ జలాల వాటా పంపకాలు, వాటి నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. దీని వల్ల తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులు ఉన్నా.. పశ్చిమ ప్రాంతాన ఇప్పటికీ తాగు, సాగునీటికి ఇబ్బందులు పడటం బాఽధాకరమన్నారు. గుండ్రేవుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, ఇరు రాష్ట్రాలకు మేలు జరిగే ఈ అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం రిజర్యాయర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయిందని వడ్డే శోభనాదీశ్వరరావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దాదాపు రెండున్నర లక్షల ఇళ్లు నిర్మాణం చేపడితే నిధులలేమితో వాటిని లబ్ధిదారులకు పంపిణి చేయక తాళాలు వేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆ ఇళ్లకు నీలి రంగు వేసి ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నా, అవి కాంట్రాక్టలకు కామధేనువుల మారాయే తప్ప, ప్రజలకు ఉపయోగపడటం లేదని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయమని, కానీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఇంత వరకు భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించకపోవటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే ఐదు పేరెన్నికగన్న నగరాల్లో ఒకటిగా నిలపాలని అనుకుంటున్నారని, దానికంటే రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆచరణ సాధ్యం కాని హామీలు, అవసరం లేని పనులను పక్కనపెట్టి సామాన్య ప్రజలకు ఉపయుక్తమైన పనులపై దృష్టి సారించి రాష్ర్టాన్ని హితవు పలికారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు గంగ, హంద్రీనీవా, వెలిగొండ, వేదవతి రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండు చేశారు. గోదావరి, బానకచర్ల నీటి మళ్లింపు ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని, కాబట్టి చిన్న ప్రాజెక్టులకు నిధులను కేటాయించి పూర్తి చేయాలన్నారు. కేఆర్‌ఏంబీని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే.. ఈ సమస్య టీడీపీకి ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం ప్రతినిధులు రామకృష్ణ, రామచంద్రయ్య, జగన్నాథం, అనంతరపురం జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వీనర్ విజయ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.