Share News

కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:12 AM

కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్‌ ముందు వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. వేదిక కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాదు నుంచీ అమరావతికి తరలించాలన్న నిర్ణయం అర్థరహితమని ప్రకటించారు. హంద్రీ పరిరక్షణ సమితి నాయకుడు కల్లూరు చంద్రశేఖరరెడి ్డ మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కరువలుఉ, వలసలు, రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని, తక్షణమే సీమలోని పెండిగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ విద్యావంతుల వేదిక కోకన్వీనర్‌ విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ రానున్న బడ్జెట్‌లో రాయలసీమకు అన్ని రంగాల్లో 42 శాతం నిధులు కేటాయించాలని అన్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలను కర్నూలులోనే యధావిధిగా కొనసాగించాలని, ఏపీజీబీ కేంద్ర కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని అన్నారు. జేవీవీ బాధ్యుడు శేషాద్రిరెడ్డి, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్నలు మాట్లాడుతూ విభజన చట్టలో సీమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ప్రభుత్వ రంగంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గుంతకల్లు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాభ్యుద సంస్థ నాయకుడు భార్గవ, ఎస్‌డీపీఐ నాయకులు చాంద్‌, ఆరిఫ్‌, ఏఐటీయూసీ నాయకుడు మనోహర్‌ మాణిక్యం, శేషగిరి, సుంకన్న, గద్వాల ఈరన్న, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్యకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Feb 26 , 2025 | 12:12 AM