అవిశ్వాసం అనివార్యమేనా?
ABN , Publish Date - Feb 15 , 2025 | 10:50 PM
ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియాపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సమాయాత్తమవుతున్నారు.

ఆత్మకూరు కమిషనర్‌ను కలిసిన కౌన్సిలర్లు
ఆత్మకూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియాపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సమాయాత్తమవుతున్నారు. గత నెల రోజులుగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కౌన్సిలర్లు దూకుడు ప్రదర్శించారు. మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు వద్దకు వెళ్లి అవిశ్వాస తీర్మాన ప్రక్రియ గురించి చర్చించారు. నెల రోజుల ముందుగానే తీర్మానం చేస్తామని కౌన్సిలర్లు ప్రస్తావించారు. అయితే మార్చి 20వ తేదీకి కార్యవర్గానికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతాయని, ఆ తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ వివరించారు. ఈ విషయంపై తాము పూర్తి పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని కౌన్సిలర్లు వెల్లడించారు. ఇదిలావుంటే ఇద్దరు మున్సిపల్ కార్మికులను అకారణంగా పక్కన పెట్టడంపై కౌన్సిలర్లు కమిషనర్‌ను ప్రశ్నించారు. కేవలం రాజకీయ ఉద్ధేశంతోనే కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన కమిషనర్ శనివారం మధ్యాహ్నం నుంచి ఆ కార్మికులను విధుల్లోకి అనుమతించారు.