Share News

డ్రోన్‌ హబ్‌ స్థలాల పరిశీలన

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:14 AM

మండలంలోని చింతలపల్లె, పాలకొలనులో డ్రోన్‌ హబ్‌ స్థలాలను పరిశీలించేందుకు చెన్నై, ఢిల్లీ నుంచి డైరెక్టర్లు ప్రత్యేక విమానంలో శుక్రవారం ఓర్వకల్లు చేరుకున్నారు.

డ్రోన్‌ హబ్‌ స్థలాల పరిశీలన
అధికారులతో మాట్లాడుతున్న డ్రోన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లు

ఓర్వకల్లులో 300 ఎకరాలు అనుకూలం

ప్రత్యేక విమానంలో వచ్చి పరిశీలించిన డ్రోన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లు

ఓర్వకల్లు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపల్లె, పాలకొలనులో డ్రోన్‌ హబ్‌ స్థలాలను పరిశీలించేందుకు చెన్నై, ఢిల్లీ నుంచి డైరెక్టర్లు ప్రత్యేక విమానంలో శుక్రవారం ఓర్వకల్లు చేరుకున్నారు. రవీంద్ర కుమార్‌, మనోజ్‌ కార్గ్‌, సీఎం పాండే బృందానికి తహసీల్దార్‌ విద్యాసాగర్‌, మండల సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ స్వాగతం పలికారు. డైరెక్టర్లు ప్రత్యేక వాహనంలో చింతలపల్లె, పాలకొలను స్థలాలను పరిశీలించారు. ఓర్వకల్లులోని 300 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు కు భూములు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ భూమి 484 సర్వే నెంబరులో 600 ఎకరాల భూమి ఉందని, అందులో 400 ఎకరాలు భూములు అనువుగా ఉన్నాయని అధికారులు వారికి తెలిపారు. రెండు గ్రామాల మధ్య అధికారులతో కలిసి డైరెక్టర్లు మ్యాప్‌ను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నామని అన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడులతో డ్రోన్‌ పాలసీ-2024-2029 ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ రూపొందించిందన్నారు. డ్రోన్‌ రంగంలో 40వేల ఉద్యోగాల కల్పన రూ.3వేల కోట్ల రాబడి లక్ష్యంగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అనంతరం వారు ఈ ప్రదేశంలో రోడ్లు, విద్యుత్‌, వాటర్‌, తదితర మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ పాల వెంకటేశ్వర్లు, ఏపీఐఐసీ సర్వేయర్‌ చెన్నయ్య, సైట్‌ ఇంజనీర్‌ సందీప్‌ కుమార్‌, చింతలపల్లి గ్రామ సర్పంచ్‌ వెంకటరమణ, టీడీపీ సీనియర్‌ నాయకులు చదువుల సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:14 AM