Share News

చెట్నహల్లి శ్మశాన స్థలం పరిశీలన

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:36 AM

మండలంలోని చెట్నహల్లి గ్రామంలో ఉన్న జగనన్న కాలనీ వద్ద ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్‌ ఎస్‌.రవి పరిశీలించారు.

చెట్నహల్లి శ్మశాన స్థలం పరిశీలన
శ్మశాన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

అడ్డుకున్న బీసీ వర్గీయులు

నివేదికలు తయారు చేసి కలెక్టర్‌కు పంపుతాం

ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌

మంత్రాలయం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని చెట్నహల్లి గ్రామంలో ఉన్న జగనన్న కాలనీ వద్ద ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్‌ ఎస్‌.రవి పరిశీలించారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో దళిత వర్గాలకు చెందిన కొంత మందిని, బీసీ వర్గాల కొంత మందిని వేర్వేరుగా అభిప్రాయాలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ, తహసీల్దార్‌ 113 సర్వేలోని జగనన్న లేఅవుట్‌ కాలనీ ఇళ్ల నిర్మాణాల ముందు శవాలను పూడ్చిన ప్రదేశాలను పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ గ్రామానికి వస్తారని తెలుసుకున్న బీసీ వర్గానికి చెందిన మహిళలు, గ్రామస్థులు, ఎస్సీవర్గాలకు చెందిన కాలనీవాసులు, పెద్ద ఎత్తున్న స్థలంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. మంత్రాలయం, కోసిగి సీఐలు రామాంజులు, మంజునాథ్‌, ఎస్‌ఐలు శివాంజల్‌, చంద్రమోహన, అధికారుల దగ్గరకు ప్రజలు రాకుండా అడ్డుకున్నారు. 126 సర్వే. నెంబరులోని శ్మశాన స్థలానికి పరిశీలించేందుకు వెళ్తున్న అధికారుల కార్లను మహిళలు అడ్డుకున్నారు. సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పా లని మహిళలు రస్తాలో భీష్మించారు. దీంతో కొంత వరకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని మైకుల ద్వారా హెచ్చరించారు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. 126సర్వే.నెంబరులోని శ్మశాన స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురైన రోడ్డును పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదికలు సమర్పి స్తామని, త్వరలోనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పా రు. అంతవరకు ఇరువర్గాలు ఘర్షణలకు పాల్పడవద్దని సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ అశోక్‌, ఆర్‌ఐ ఆదాం, వీఆర్వో భీముడు, సర్పంచ బెస్త భీమయ్య, ఉప సర్పంచ నాగ లింగడు, మాజీ సర్పంచ అల్లింగప్ప, ఎంపీటీసీ రామాంజనేయులు, టీడీపీ నాయకులు చాపల నగేష్‌, రవి దానియేలు, నరసింహులు, ప్రసాద్‌, లాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:36 AM