అక్రమ ఇసుక దందా..
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:58 AM
మంత్రాలయంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ సంపాదనే ధ్యేయంగా అక్రమ ఇసుకకు తెర లేపారు.
మంత్రాలయంలో అడ్డూ అదుపూ లేకుండా అక్రమ రవాణా
రాత్రి, పగలు తుంగభద్రను తోడేస్తున్న తెలుగు తమ్ముళ్లు
ఉచిత ఇసుక పేరుతో అక్రమ సంపాదన
మంత్రాలయం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ సంపాదనే ధ్యేయంగా అక్రమ ఇసుకకు తెర లేపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలనే సదుద్దేశంతో ప్రవేశ పెట్టగా.. ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు ఉచిత ఇసుక పేరుతో లాడ్జీలు, హోటళ్లకు, పెద్ద పెద్ద భవంతులకు నది నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు. కొంత మంది తెలుగు తమ్ముళ్లు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని అధికారులను గుప్పిట్లో పెట్టుకుని తమ మాట వినకుంటే టీడీపీ నాయకుల నుంచి ఫోన్లు చేయించి దర్జాగా అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. మంత్రాలయంలో ఈ మధ్య కాలంలో దాదాపు 25 నుంచి 30 కొత్త లాడ్జీల నిర్మాణం చేపట్టారు. వీటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రీచుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరగాల్సి ఉండగా.. అవేమీ పట్టించుకోకుండా పక్కనే ఉన్న తుంగభద్ర నది నుంచి రాత్రి, పగలు అని తేడా లేకుండా భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క లాడ్జీ నిర్మాణం వద్ద 15 నుంచి 50 ట్రాక్టర్ల దాకా ఇసుకను డంప్ చేసుకున్నారు. ఇది అక్రమమని తెలిసినా కూడా వారిని అడిగే వారు లేరు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇక్కడి నాయకులు మాత్రం సొమ్ము చేసుకునే అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఎమ్మిగనూరు, కల్లుదేవకుంట, చిలకలడోన, సూగూరు, బూదూరు, మాలపల్లి, మాధవరం, సుంకేశ్వరి, రచ్చుమర్రి గ్రామాలకు సరఫరా చేస్తూ రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు.
రెండు ట్రాక్టర్లు సీజ్
సూగూరు గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ రవి, మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్, వీఆర్వో భీమన్నగౌడు తెలిపారు. రాగసుధ వద్ద ఓ ప్రైవేటు లాడ్జీ నిర్మాణానికి ఎన్‌ఏపీ పుష్కర ఘాట్ నుంచి ఇసుకను తోలుతున్న రజాక్, వెంకటేశ్‌లకు చెందిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేశామని, మరో రెండు ట్రాక్టర్లు తప్పించుకున్నాయని తెలిపారు. రెండు ట్రాక్టర్లకు చెరో రూ.10వేలు జరిమానా విధించారు.
లాడ్జీలకు అనుమతి ఉంటేనే ఉచిత ఇసుక
మంత్రాలయంలో పేదల ఇళ్లకు, సాధారణ గృహాలకు ఉచిత ఇసుకను తోడుకోవచ్చని, లాడ్జీలకు, హోటళ్లకు, పెద్ద పెద్ద భవనాలకు అనుమతి లేకుండా నది నుంచి ఇసుక తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే నదిలో అక్రమ ఇసుకకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి నివారించామన్నారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు ఆదేశాలు జారీ చేశామని, అక్రమ ఇసుక డంప్‌లను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. - ఎస్ రవి, మంత్రాలయం, తహసీల్దార్
అక్రమ ఇసుక అని తేలితే.. కేసు నమోదు
తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే రెవెన్యూ అధికారుల సలహాలు, సూచనలతో కేసులు నమోదు చేస్తాము. శనివారం అక్రమంగా లాడ్జీలకు తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్‌కు అప్పగించాం. నదీ తీరంలో అక్రమ ఇసుకకు పాల్పడే వారిపై నిఘా ఉంచాం. - శివాంజల్, ఎస్‌ఐ, మంత్రాలయం