Share News

కర్ణాటక బ్యారేజీ కడితే జిల్లా ఎడారే

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:55 PM

తుంగభద్ర నదిపై కర్ణాటక బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణాలు చేపడితే కర్నూలు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి అన్నారు.

కర్ణాటక బ్యారేజీ కడితే జిల్లా ఎడారే
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి

తుంగభద్రపై ప్రాజెక్టులను అడ్డుకుంటాం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది

జిల్లా ఇంజనీర్లతో ఎలా మాట్లాడుతారు?

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై కర్ణాటక బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణాలు చేపడితే కర్నూలు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయచూరు జిల్లాలోని చిలకలపర్వి, కౌతాళం మండలం కుంబళనూరు మధ్య బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణం చేసి దిగువకు చుక్కనీరు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర జలాలు అంతర్రాష్ట్ర సమస్య కావడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశమన్నారు. జిల్లా ఇరిగేషన్‌ ఇంజనీర్లతో కర్ణాటక మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ స్థాయి ఇంజనీర్లు చర్చించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మన ఇంజనీర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడమని తేల్చి చెప్పాల్సిందిపోయి వారితో ఎలా మాట్లాడుతారని నిలదీశారు. కర్టాటక ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు వల్ల జిల్లాలో ఆర్డీఎస్‌ కుడి కాలువ, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు, సుంకేసుల బ్యారేజీకి నీటి నిల్వలు ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మించదలిచిన ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

బాబాయ్‌ వివేకాను చంపింది ఎవరో జగనే తేల్చాలి

అమ్మకు చెల్లికి న్యాయం చేయని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని తిక్కారెడ్డి ప్రశ్నించారు. బాబాయ్‌ వివేకానందారెడ్డిని హత్య చే సింది ఎవరో వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు వైసీపీ హయాంలో ధ్వంసం చేసిన రాష్ర్టాన్ని గాడిలో పెట్టేందుకు రాత్రిబహుళ్లు శ్రమిస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలు, ఘోరాలను బట్టి చూస్తే జీవితాంతం జైలు జీవితం గడాల్సి వస్తుంద న్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందులలో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్‌, డైరెక్టర్లు ముంతాజ్‌, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్‌, జేమ్స్‌, బేతం క్రిష్ణుడు, తిరుపాల్‌బాబు, సత్రం రామక్రిష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:55 PM