ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్ష
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:58 PM
జిల్లాలోని 30 కేంద్రాల్లో నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.

పేపరు-1కు 86.99 శాతం,
పేపరు-2కు 86.84 శాతం మంది అభ్యర్థులు హాజరు
పరిశీలించిన కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 30 కేంద్రాల్లో నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఆదివారం ఉదయం కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కాలేజీని కలెక్టర్ పరిశీలించారు. ఎ.క్యాంపు మాంటిస్సోరి స్కూల్, ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు గ్రూప్-2 పేపర్-1 పరీక్షలు, పేపర్-2 మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించినట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 9993 మందికి 8693 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షకు 8678 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. పేపర్-1కు 86.99 శాతం, పేపర్-2కు 86.84 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు.
తనిఖీ చేసిన ఎస్పీ
కర్నూలు క్రైం: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షీ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. స్థానిక సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో క్లస్టర్ల వారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ప్రాక్టీసు వంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టామన్నారు. అభ్యర్థులు సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా తనిఖీలు చేపట్టామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజరావు, పవన్ కుమార్ ఉన్నారు.