ఉపాధి పనులకు విద్యావంతులు
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:01 AM
డిగ్రీ, బీఈడీ, టీటీసీ ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఉపాధి పనులకు వెళుతున్నారు. నోటిఫికేషన్లు లేకపోవడంతో కుటుంబానికి భారం కాకూడదని పని చేస్తున్నామంటున్నారు.

తుగ్గలి మండలం సూర్య తండాలో 50మంది హాజరు..
పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినతి
తుగ్గలి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సూర్య తండాలో వెయ్యి మంది వరకు జీవిస్తున్నారు. అయితే గ్రామంలోని ఉన్నత విద్య అభ్యసించిన నిరుద్యోగులు దాదాపు 50మంది వరకు నిరుద్యోగులు ఉపాధి పనులు చేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూసి విఫలమవడంతో ఇక ఉపాధి పనులకు వెళుతున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీలు, టీటీసీ కూడా చదివినట్లు చదువులు నిరుద్యోగులు తెలిపారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయలేక ఇక్కడే పనిచేస్తున్నట్లు వారు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ కోసం చూస్తున్నా
నేను డిగ్రీ, టీటీసీ పూర్తి చేసి టెట్‌లో ఉత్తీర్ణత కూడా సాధించాను. డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా. కుటుంబ పోషణ భారమవుతుండటంతో భర్తతో పాటు ఉపాధి పనులకు వస్తున్నా. ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. - మంగమ్మ, సూర్యతండా.
ఉద్యోగంపై ఆశలు వదులుకున్నా
డిగ్రీ వరకు చదివాను. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసినా నోటిఫకేషన్లు రాలేదు. దీంతో నిరాశ చెంది ఉపాధి పనులు చేస్తే జీవిస్తున్నా. - రవీంద్ర నాయక్, సూర్యతండా.