బంగారు అక్రమ రవాణా
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:41 PM
బంగారం అక్రమ రవాణాపై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు పక్కా నిఘా పెట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పట్టుకున్న సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు
కేరళ నుంచి ఆదోనికి 13 కిలోలు రైలులో తరలింపు
పట్టుబడిన బంగారం విలువ రూ.10 కోట్ల పైమాటే
కర్నూలు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బంగారం అక్రమ రవాణాపై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు పక్కా నిఘా పెట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి తరలిస్తుండగా పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. వ్యాపార, వాణిజ్య రంగంలో రెండో ముంబాయిగా పేరుగాంచిన ఆదోని బంగారు వ్యాపారంలోనూ ప్రసిద్ధి. మెజార్టీగా జీరో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆదోనికి చెందిన 12 మంది బంగారు వ్యాపారులు 13 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు (గోల్డ్ బార్) కేరళ రాష్ట్రం ఎర్నాకుళం పట్టణంలో కొనుగోలు చేశారు. బంగారంతో కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎక్కారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఆదోని వ్యాపారులు బంగారం రైలులో తీసుకెళ్తున్నారని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులకు పక్కాగా సమాచారం వచ్చింది. ఆ శాఖ సూపరింటెండెంట్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది దాడులు చేశారు. రైలులో బోగిబోగిని క్షుణంగా తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో గురువారం బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఆదోని వ్యాపారులను పట్టుకొని వారి నుంచి దాదాపు 13 కిలోలు అసలైన బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టబడిన బంగారం విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. బంగారం, రవాణా చేస్తున్న వ్యాపారులను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం పోలీస్ బందోబస్తుతో బంగారం, వ్యాపారులను విజయవాడకు తరలించారు. ఈ విషయం ఆదోనిలో ప్రధాన చర్చగా మారింది. రాయలసీమ జిల్లాల్లో బంగారు వ్యాపారంలో ప్రొద్దుటూరు తరువాత ఆదోని పట్టణానికి ఎంతో పేరు ఉంది. అదే స్థాయిలో జీరో వ్యాపారం, బంగారు అక్రమ రవాణా కూడా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గతంలో బంగారం అక్రమ రవాణాలో ఇద్దరు పోలీసులు కూడా సస్పెండ్ అయిన సంఘటనలు ఉన్నాయి. కాగా.. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగరంలో కొంత భాగం బంగారానికి బిల్లులు ఉన్నాయని ఆదోని వ్యాపారి ఒకరు పేర్కొనడం కొసమెరుపు.