Share News

నిధులు.. నీరు..!

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:58 PM

నిధులు.. నీరు..!

నిధులు.. నీరు..!
అసంపూర్తిగా గాజులదిన్నె జలాశయం సామర్థ్యం పెంపు పనులు

సాగునీటి వనరుల నిర్వహణ గాలికొదిలేసిన జగన్‌

అధ్వానంగా కాలువలు.. దెబ్బతిన్న లైనింగ్‌

టీడీపీ కూటమి రాకతో రైతుల్లో ఆశలు

మార్చి 3న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల

ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.924 కోట్లు అవసరం

హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూ.2,340 కోట్లు

ప్రతిపాదనలు పంపిన జలవనరుల ఇంజనీర్లు

వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ ఈ బడ్జెట్‌లో లేనట్లేనా..?

వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణను గాలికొదిలేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలను అటకెక్కించారు. కాలువల లైనింగ్‌ దెబ్బతింది. పంట చేలకు సాగునీరు అందించే పంట కాలువలు అధ్వానంగా మారాయి. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం.. తొమ్మిదేళ్ల తరువాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంతో కాలువల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణాలపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్చి 3న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2025-26 సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులపై కసరత్తు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ కోసం రూ.924 కోట్లు, హంద్రీనీవా, గాలేరు-నగరి, ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు మరో రూ.2,340 కోట్లు నిధులు కావాలని జలవన రుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. కరువు.. వలసల నివారణే లక్ష్యంగా చేపట్టిన వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టుల నిర్మాణం ప్రశ్నార్థకమేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరకొర నిధులు కోరడమే ఇందుకు ప్రధాన కారణం. బడ్జెట్‌ ప్రతిపాదన వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, తెలుగుగంగ.. వంటి ప్రాజెక్టులకు సాగు, తాగునీరు కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే మళ్లించాలి. జలవనరుల హబ్‌గా పేరుగాంచిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ ప్రాజెక్టులు నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గాలికొదిలేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టు పరిధిలో దాదాపుగా 9.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. జలాశయాల నుంచి పొలాలకు సాగునీరు చేరాలంటే కాల్వలు ఎంతో కీలకం.. ఆ కాలువలు రైతన్నల జీవనాడులు. కేసీ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాలువ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, తెలుగుగంగ కాలువ, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, ఎస్‌ఆర్‌బీసీ.. వంటి నీటివరులు గత వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. జూన్‌ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కాలువ నిర్వహణపై దృష్టి సారించారు. తక్షణ మరమ్మతులకు అసరమైన నిధులు ఇచ్చారు. ఈ నెల 24 నుంచి 2025-26 బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాఖల వారీగా బడ్జెట్‌ కేటాయింపులపై కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ జిల్లా నుంచి ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కావాల్సి ఉందో ప్రతిపాదనలు కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా సహా హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు మరో 2,340 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఫైనాన్స్‌ మినిస్టర్‌ పయ్యావుల కేశవ్‌ కరువు జిల్లాపై ఏ మేరకు కరుణ చూపుతారో వేచి చూడాలి.

రూ.924 కోట్ల నిధులు ఇవ్వండి

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వివిధ ప్రాజెక్టు కింద సుమారు 9.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రాజెక్టులు, కాలువలు నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు సహా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.924 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. వాస్తవంగా రూ.1,200 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఈఎన్‌సీ నుంచి వచ్చిన సూచనల మేరకు రూ.924 కోట్లకు తగ్గించారు. అందులో ఇంజనీర్లు, సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర ఖర్చులకే రూ.250 కోట్లు అవసరం ఉంది. రూ.674 కోట్లు మాత్రమే కాలువలు, ప్రాజెక్టు నిర్వహణ కోసం అడిగారు. శ్రీశైలం ప్రాజెక్టుకు రూ.55 కోట్లు, టీబీపీ ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద రూ.250 కోట్లు, కేసీ కెనాల్‌, కుందూ నది విస్తరణ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద కోసం రూ.180 కోట్లు అడిగారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, ఎస్సార్బీసీ కాలువకు రూ.40 కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.30 కోట్లు, గాజులదిన్నె ప్రాజెక్టుకు రూ.28 కోట్లు, హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువులకు నీటిని ఎత్తిపోసే పథకానికి రూ.40 కోట్లు.. ఇలా ప్రాజెక్టుల వారీగా అవసరమైన మేరకు నిధుల కేటాయింపులు చేయాలని నివేదికలు పంపారు.

సీమ ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. అందులో కర్నూలు, నంద్యాల జిల్లాలకు రూ.2,340 కోట్లు ప్రతిపాదించారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2025-26 బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు కేటాయించాలని ఆ ప్రాజెక్టు అనంతపురం సీఈ నాగరాజు ప్రతిపాదన పంపారు. కర్నూలు జిల్లాలో విస్తరణకు రూ.690 కోట్లు అవసరం ఉంది.

నంద్యాల, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 2.60 ఎకరాలకు సాగునీరు అందించే గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు నిధులు అవసరం ఉందని ఆ ప్రాజెక్టు తిరుపతి సీఈ మల్లికార్జునరెడ్డి ప్రతిపాదనలు పంపారు. అందులో నంద్యాల జిల్లాలో పనులకు రూ.450 కోట్లు అవసరం ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లో పెండింగ్‌ బిల్లులే రూ.1,900 కోట్లు చెల్లించాల్సి ఉంది.

నంద్యాల, కడప జిల్లాల్లో 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ.5,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ఈ ప్రాజెక్టు కడప సీఈ శ్రీనివాసులు ప్రతిపాదనలు పంపారు. నంద్యాల జిల్లాలో పెండింగ్‌ బిల్లులే సుమారుగా రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఆ ప్రాజెక్టుల మాటేమిటి?

కరువు, వలసల నివారణే లక్ష్యంగా 2019కి మునుపు టీడీపీ ప్రభుత్వంలో ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రూ.1,942 కోట్లతో వేదవతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.90 కోట్లు ఖర్చు చేశారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రూ.1,985.42 కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువ (రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌) చేపట్టారు. 0.65 శాతం రూ.12.90 కోట్లు పనులు మాత్రమే చేశారు. వైసీపీ హయాంలో నిధుల లేమితో నిర్మాణాలు అటకెక్కాయి. టీడీపీ ప్రభుత్వం రాగానే పనులు మొదలు పెడుతామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. ఎనిమిది నెలలు దాటినా పనులు మొదలు పెట్టలేదు. రెండు ప్రాజెక్టులకు రూ.3,927.42 కోట్లు అవసరం ఉంది. పెరిగిన రేట్లు సరేసరి. 2025-26 బడ్జెట్‌లో టీబీపీ ఎల్లెల్సీతో కలిపి ఈ రెండు ప్రాజెక్టులకు రూ.250 కోట్లు ప్రతిపాదించారు. అందులో వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువకు రూ.200 కోట్లు మించదు. ఇప్పటికే రూ.14 కోట్లు బకాయి ఉంది. అంటే కావాల్సిన నిధుల్లో 5.09 శాతం కూడా ప్రతిపాదించలేదు. ఆ బడ్జెట్‌ కూడా ఇస్తారని నమ్మకం లేదు. అంటే ఈ ఏడాది వేదవతి, ఆర్డీఎ్‌సలు పట్టాలెక్కడం ప్రశ్నార్థకమేనా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏటా 5-10 శాతం నిధులు కేటాయిస్తే వీటిని పూర్తి చేయడానికి ఎంత తక్కువ కాదన్నా 25 ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు ఇంకా సమయం ఉండడంతో ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డిలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులకు రూ.1,000-1,500 కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు.

గాజులదిన్నెకు ఇచ్చింది రూ.28 కోట్లు

కర్నూలు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు గాజులదిన్నె జలాశయం. 4.5 టీఎంసీ నుంచి 5.50 టీఎంసీలకు సామర్థ్యం పెంపు, నూతన గేట్లు ఏర్పాటు పనులు, భూ సేకరణ కలిపి రూ.137 కోట్లతో చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం రూ.24 కోట్లు బిల్లులు బకాయి పెట్టింది. బకాయి చెల్లింపు, పనులు చేయాలంటే రూ.72 కోట్లు అవసరం ఉంది. ప్రతిపాదించింది మాత్రం రూ.28 కోట్లే.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల

వారీగా 2025-26 బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.కోట్లల్లో

ప్రాజెక్టు ప్రతిపాదించిన

బడ్జెట్‌

శ్రీశైలం ప్రాజెక్టు 55

టీబీపీ ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్‌ 250

కేసీ కెనాల్‌ కుందూ విస్తరణ 183

ఎస్సార్బీసీ కాలువ 40

రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులు 40

గురురాఘవేంద్ర ప్రాజెక్టు 30

గాజులదిన్నె జలాశయం 28

68 చెరువుకుల నీటి ఎత్తిపోతలు 40

సిద్ధాపురం ఎత్తిపోతల పథకం 8

జీతాలు, ఇతర ఖర్చులు 250

మొత్తం 924

హంద్రీనీవా ప్రాజెక్టు 690

గాలేరు-నగరి ప్రాజెక్టు 450

ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు 1,200

మొత్తం 3,264

Updated Date - Feb 15 , 2025 | 10:58 PM