ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి: కలెక్టర్
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:21 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు

నంద్యాల కల్చరల్, జనవరి 06 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24గంటలలోపు పరిష్కరించాల్సిన మూడు ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ బండి ఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, బనగానపల్లి, సంజామల మండలాలలో పెండింగ్‌లో ఉన్న ఫ్రీహోల్డ్ భూముల డేటాను క్షేత్రస్ధాయిలో పరిశీలించి నమోదు చేయాలని ఆర్డీఓ, సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 170 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.