తాగునీటి సమస్యపై దృష్టి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:42 PM
జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
వివిధ శాఖల పురోగతిపై సమీక్ష
కర్నూలు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం వివిధ శాఖల పనితీరు, చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. నీటి రవాణా చేసే గ్రామాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై చర్చించారు. అలాగే పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్లు తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పక్కా ప్రణాళిక ఉండాలి
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఎంతో ముందు చూపుతో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్-1 స్థానంలో నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అదే తరహాలో జిల్లాలో అధికారాలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో జిల్లా ప్రగతికి పాటు పడాలని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రణాళికలు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రాధాన్యత పరంగా ఏమి చేయాలో ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే ఆ వివరాలు ఇస్తే రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.
‘పల్లె పండుగ’లో ప్రథమం
పల్లె పండుగ పనుల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. వివిధ గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో 830 పనులు మంజూరు చేస్తే ఇప్పటికే 758 పనులు పూర్తి చేశాం. 91 శాతం పురోగతితో కర్నూలు జిల్లా రాష్ట్రంలో నెంబర్-1 స్థానంలో ఉందన్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో 1074 కిలోమీటర్లు మంజూరు చేస్తే 884 కిలోమీటర్లు ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి చేశామన్నారు. వివిధ మున్సిపాలిటీల్లో రోడ్లు, గుంతలు పూడ్చే పనులు జరుగుతున్నాయనీ, జనవరి ఆఖరులోగా ఆ పనులు చేస్తామని తెలిపారు. ఈ సమావశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎస్పీ జి.బిందుమాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉమాపతి, కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు, డీఈవో శామ్యూల్ పాల్, జలవనరుల శాఖ ఎస్‌ఈ బి.బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.