పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:39 AM
పట్టణంలోని సంతోష్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ టీఎంసీ పరిశ్రమలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో హమాలీలు, కూలీలు భోజనాలు చేస్తున్నారు. మిల్లు మధ్యలో విద్యుత్ తీగలకు ఎక్స్‌కలేటర్ తగిలి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఆర్పే ప్రయత్నాలు చేశారు. వందల టన్నులు పత్తి, దూది బేళ్లు ఉండడంతో క్షణాల్లో మంటలు మిల్లు మొత్తం వ్యాపించాయి. హమాలీలు, కూలీలు, రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఆదోని (అగ్రికల్చర్)/కర్నూలు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సంతోష్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ టీఎంసీ పరిశ్రమలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో హమాలీలు, కూలీలు భోజనాలు చేస్తున్నారు. మిల్లు మధ్యలో విద్యుత్ తీగలకు ఎక్స్‌కలేటర్ తగిలి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఆర్పే ప్రయత్నాలు చేశారు. వందల టన్నులు పత్తి, దూది బేళ్లు ఉండడంతో క్షణాల్లో మంటలు మిల్లు మొత్తం వ్యాపించాయి. హమాలీలు, కూలీలు, రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దాదాపుగా రూ.10 కోట్లు నష్టం జరిగింది.
ఆదోని పత్తి మార్కెట్ యార్డు సమీపంలోని సంతోష్ టీఎంసీ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలో బుధవారం హమాలీలు, కూలీలు బిజీగా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి పత్తి తీసుకొచ్చిన రైతులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మిల్లు మధ్యలో ఉన్న ఎక్స్‌కలేటర్.. పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలి, షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పు రవ్వలు పత్తి, దూదిపై పడ్డాయి. పత్తి, దూది, దూదిబేళ్లు పెద్ద సంఖ్యలో నిలువ ఉండడంతో నిప్పు రవ్వలు పడగానే మంటలు చెలరేగాయి. మిల్లులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పేందుకు హమాలీలు, సిబ్బంది ప్రయత్నించారు. అయినా క్షణాల్లో మంటలు మిల్లు మొత్తాన్ని వ్యాపించి ఉవ్వెత్తున ఎగశాయి. హమాలీలు, కూలీలు, సిబ్బంది, రైతులు ప్రాణభయంతో పరుగులు బయటకు పరుగులు తీశారు. మిల్లు అంతా దట్టమైన పొగ అలుముకుంది.
మార్కెట్ యార్డులోని అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలం చేరుకొని సహాయక పనుల్లోకి దిగారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. ఆదోని రెండు ఫైర్ ఇంజన్లతో పాటు ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తెప్పించి 40-45 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీ ప్రమాదం కావడంతో స్థానిక అగ్ని మాపక విభాగం ఫైర్ ఆఫీసర్ రామాంజనేయులు సమాచారం మేరకు అగ్ని మాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎ్‌ఫఓ) భూపాల్‌రెడ్డి, డీఎ్‌ఫఓ అవినాశ్ జయసింహ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 9.30 గంటలు దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతునే ఉన్నాయి.
రూ.10 కోట్లకుపైగా నష్టం..
సంతోష్ జిన్నింగ్ మిల్లులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అనధికారిక అంచనా. రూ.1.80 కోట్ల విలువైన 600 పత్తిదూది బేళ్లు (ఒక్కో బేలు 170 కిలోలు), రూ.2 కోట్లకు పైగా విలువైన పత్తి చెక్కులు, రూ.కోటికి పైగా విలువ చేసే పత్తి గింజలతో పాటు విలువైన టీఎంసీ కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ యంత్ర సామగ్రి, ఇతర పరికరాలు, మిల్లు మొత్తం కాలిబూడిదైందని మిల్లు యజమాని ప్రశాంత్ కన్నీరుమున్నీరయ్యారు. దాదాపుగా రూ.9-10 కోట్లకుపైగా నష్టం వాట్లిందని వాపోయారు. మూడు నాలుగేళ్లలో పత్తి మిల్లుల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఇదే అతిభారీ ప్రమాదమని స్థానికులు అంటున్నారు. 2021 మార్చి 29న ఆస్సరి రోడ్డులోని వెంకటలక్ష్మి, తిరుపతమ్మ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.60 వేలు నష్టం జరిగింది. 2023 జనవరిలో సంతోష్ పత్తి మిల్లులో జరిగిన ప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. 2023 అక్టోబరులో బసవేశ్వర కాటన్ జన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా నష్టం జరిగింది. అత్యంత భారీ అగ్ని ప్రమాదం ఇదేనని, పూర్తిగా మిల్లు కాలిబూడిదైందని స్థానికులు పేర్కొన్నారు.
భారీ ప్రమాదం ఇది
సంతోష్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సిం గ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగైదేళ్లలో ఇదే భారీ ప్రమాదం. పత్తి, దూదితో పాటు యంత్రాలు, బిల్లు పూర్తిగా కాలిపోయింది. రాత్రి 10 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఐదు ఫైర్ ఇంజన్లు, 40 మందికి పైగా సిబ్బందితో మంటలు ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాం. పూర్తిగా అదుపులోకి వచ్చాక, యాజమాన్యం రికార్డులు పరిశీలించి ఎంత నష్టం జరిగిందీ అంచనా వేస్తాం. - అవినాశ్ జయసింహ, డీఎ్‌ఫవో, అగ్నిమాపక శాఖ, కర్నూలు
రూ.10 కోట్ల వరకు నష్టం
మధ్యాహ్నం సమయంలో పరిశ్రమలు 50 మందికి పైగా ఉన్నాం. జిన్నింగ్, ప్రెస్సింగ్ పనులు జరుగుతున్నాయి. పత్తి దూది బేళ్లు కొనుగోలు చేసేందుకు కొందరు వచ్చారు. వారితో మాట్లాడుతున్నాం. ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు పత్తి, దూదిపై పడడంతో మంటలు వ్యాపించాయి. పరిశ్రమ మొత్తం కాలిబూడిదైంది. సుమారు రూ.10 కోట్లకు పైగా నష్టం జరిగింది. - ఎన్.ప్రశాంత్, పరిశ్రమ యజమాని, ఆదోని