Share News

ఎట్టకేలకు కదలిక

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:18 AM

బనగానపల్లె రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్లు భవనాల శాఖా మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడంతో పనులను ప్రారంభించారు.

ఎట్టకేలకు కదలిక
బనగానపల్లె పట్టణ శివారులో రింగ్‌ రోడ్డు పనులు

ప్రారంభమైన రింగ్‌ రోడ్డు పనులు

తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

బనగానపల్లె, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్లు భవనాల శాఖా మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడంతో పనులను ప్రారంభించారు. దీంతో బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. రింగ్‌ రోడ్డు లేకపోవడంతో బనగానపల్లె పట్ణణంలో ట్రాఫిక్‌కు నిత్యం అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. బనగానపల్లె సమీపంలోని యనకండ్ల వద్ద నిర్మించిన జయజ్యోతి సిమెంట్‌ ఫ్యాక్టరీ, కొలిమిగుండ్ల మండలంలో నిర్మించిన రామ్‌కో సిమెంట్‌, అల్ర్టాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలు, ప్యాపిలి మండలంలోని బూరుగుల సమీపంలో నిర్మించిన ప్రియా సిమెంట్‌ ఫ్యాక్టరీల నుంచి నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు బనగానపల్లె పట్టణం మీదుగా వెళతాయి. ఈ ఫ్యాక్టరీలకు అవసరమైన బొగ్గు, సుద్ద, సిమెంట్‌ను, ఇతర ముడి ఖనిజాలను భారీ వాహనాల్లో బనగానపల్లె మీదుగా తరలిస్తుంటారు. దీంతో బనగానపల్లె పట్టణంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. దీంతో 2019 సంవత్సరంలో రూ.50 కోట్ల వ్యయంతో అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి రింగ్‌ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో రింగ్‌ రోడ్డు నిర్మాణం పనులు ఆగిపోయాయి. తిరిగి ఇప్పుడు పనులు ప్రారంభం కావడంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ సమస్య తీరనుంది.

18 నెలల్లో పూర్తికి కసరత్తు

బనగానపల్లె రింగ్‌ రోడ్డును పట్టణ శివారులోని యాగంటిపల్లె ప్రధాన రహదారి నుంచి పాణ్యం రహదారి వరకు రోడ్డు నిర్మించనున్నారు. 18 నెలల్లోనే రింగ్‌ రోడ్డు పనులు చేయాలని మంత్రి ఆర్‌ఆండ్‌బీ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని ఆర్‌ఆండ్‌బీ డీఈ సునీల్‌రెడ్డి అన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:18 AM