Share News

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:51 PM

నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి దివంగత బీవీ మోహనరెడ్డి జ్ఞాపకార్థం రైతు సంబరాల పేరుతో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా ఉత్కంఠ భరితంగా సాగాయి.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బండలాగుతున్న వృషభాలు

ఎమ్మిగనూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి దివంగత బీవీ మోహనరెడ్డి జ్ఞాపకార్థం రైతు సంబరాల పేరుతో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి ఆరుపళ్ల పాలసైజు విభాగంలో 15జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూలు, ఏపీలోని నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి ఎద్దుల జతలు పోటీల్లో పాల్గొని తమ సత్తాను చాటాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం కామవరం గ్రామానికి చెందిన అక్షిరరెడ్డి వృషభాలు నిర్ణీత సమయంలో 4,785.8 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.40వేలను కైవసం చేసుకున్నాయి. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురం గ్రామానికి చెందిన బిజ్జెమ్మ, వెంకటకృష్ణమ్మల వృషభాలు 4,553.8 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ బహుమతి రూ.30వేలను గెలుచుకోగా, కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన చిన్నరత్నం వృషభాలు 4,500 దూరాన్ని లాగి మూడవ స్థానంలో నిలిచి రూ.20వేలు కైవసం చేసుకున్నాయి. అలాగే పత్తికొండ నియోజకవర్గంలోని పందికోన గ్రామానికి చెందిన లవకుమార్‌ గోవిందయాదవ్‌, గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామానికి చెందిన ఇ.శ్రీనివాసులగౌడు వృషభాలు, ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ వృషభాలు నిర్ణీత సమయంలో 4,200 అడుగుల దూరాన్ని సమానంగా లాగడంతో 4,5,6 బహుమతులను గెలుచుకున్నాయి. గెలుపొందిన వృషభారాజుల యజమానులకు కమిషనర్‌ గంగిరెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ బీవీ మధుసూదనరావు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో వైడబ్ల్యూసీఎస్‌ మైదానం కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో నిర్వాహకులు పార్లపల్లి చంద్రశేఖర్‌, భాస్కర్‌, విరుపాక్షిరెడ్డి, రాళ్లదొడ్డి మురళికృష్ణారెడ్డి, రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, కాశింవలి, పంచముఖి మహేంద్ర, రాందాసుగౌడు, జగదీష్‌, వెంకటరామిరెడ్డి, కోటేశ్వర శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:51 PM