రైతు జాతర..
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:45 PM
ఎమ్మిగనూరు జాతర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ జాతరలో రైతులు మొదలుకొని చిన్న పిల్లల వరకు వారికి అవసరమయ్యే వస్తు సామగ్రి లభిస్తుంది.

రూ.లక్షల్లో పలుకుతున్న వృషభాలు
వివిధ ప్రాంతాల నుంచి విక్రయానికి వచ్చిన ఎద్దులు
ఎమ్మిగనూరు , జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు జాతర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ జాతరలో రైతులు మొదలుకొని చిన్న పిల్లల వరకు వారికి అవసరమయ్యే వస్తు సామగ్రి లభిస్తుంది. దీంతో ఈ జాతరకు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి జనాలు ఈ జాతరకు తరలి వస్తారు. ప్రధానంగా రైతులకు అవసరమయ్యే చర్ణాకోలు (చెలకోల) మొదలు కొని వృషభాలు, వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. దీంతో రైతులు ఈ జాతర వచ్చిందంటే వృషభాలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తారు. ఎమ్మిగనూరు చుట్టుముట్టు గ్రామాల నుంచి గాక తెలంగాణ, కర్ణాటక నుంచి పశుపోషకులు తమ వృషభాలను విక్రయానికి తీసుకురావడంతో మంత్రాలయం రోడ్డులోని శ్రీనివాస నగర్‌లో ఏర్పాటు చేసిన సంత సందడిగా మారింది. ఇందులో దేశవాళి వృషభాలు రూ.70 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు ధర పలకడం విశేషం.
అందుబాటులో వ్యవసాయ పనిముట్లు..
రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు సైతం జాతరలో వ్యాపారులు రైతులకు అందుబాటులో పెట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల రోడ్డులోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ ముందు ఎద్దుల బండ్లు, బండి చక్రాలు, కాడిమాన్లు, నాగళ్లు, గుంటికలు, గొర్రులు, బండి నాగళ్ల, దంతెలు విక్రయానికి ఉంచారు. వీటిని రైతులు కొనుగోలు చేస్తూ కనిపించారు.
చెక్కపాయె.. ఇనుము వచ్చే..
ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లు చెక్కతోనే తయారు చేసిన వాటిని వినియోగిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి చెక్క స్థానంలో ఇనుముతో తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు పుష్కలంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూరులో జాతరలో గతంలో చెక్క వ్యవసాయ సామగ్రి కనిపించేది. అయితే ప్రస్తుతం వాటి స్థానంలో ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లు, గొర్రులు, బండి చక్రాలు, దంతెలు, నాగళ్లు కనిపిస్తున్నాయి. రైతులు సైతం ఎక్కువ రోజులు మన్నిక వస్తాయన్న ఆశతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి, పుట్టపాశం, తెలంగాణలోని సింగారంతోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ ఇళ్ల దగ్గరే ఇనుముతో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయానికి తెచ్చారు. దాదాపు 15-20 రోజుల వరకు వీటిని ఉంచి విక్రయిస్తారు. ఒక ఎద్దుల బండి రూ.42 వేల వరకు పలుకుతోంది. ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లకు టైర్ల చక్రాలను అమర్చి విక్రయిస్తున్నారు.