Share News

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:02 AM

పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు
జేసీ కారు ముందు బైఠాయించిన జీడీపీ ఎగువ ప్రాంత రైతులు

గోనెగండ్ల, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ నీటి నిల్వ కారణంగా 150 నుంచి 200 ఎకరాల ఆయకట్టు భూములు మునిగి పోతున్నాయని రైతులు కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఆయకట్ట భూములను ఆయన పరిశీలించడానికి వచ్చారు. అయితే జాయింట్‌ కలెక్టర్‌ వాహనాన్ని రైతులు అడ్డగించారు. ఏటా రబీలో సాగు చేసిన పంటలు నీట మునుగుతున్నాయని, ఖరీఫ్‌ సాగు చేసుకునేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా సమస్య ఉన్నా, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయకట్టు రైతులు నజీర్‌హమ్మద్‌, రమేష్‌నాయుడు, మాజీ సర్పంచ్‌ బజారి, వీరేశ్‌ సబ్‌ కలెక్టర్‌తో మాట్లాడుతూ జీడీపీ అధికారులు 376 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తే కొంత భూమి మాత్రమే నీట మునుగుతుందని, అయితే 377 మీటర్ల వరకు నీటి నిల్వ చేయడం వల్ల 200 ఎకరాల వరకు ఆయకట్టు భూమి నీట మునుగుతోందని చెప్పారు. ఈ ఏడాది 377 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడంతో గోనెగండ్ల, ఐరన్‌బండ, ఎన్నెకండ్ల తదితర గ్రామాల రైతులు సాగు చేసుకున్న పత్తి, మిరప, వేరుశనగ, ఉల్లి, మొక్కజొన్న పంటలు దాదాపు 180 ఎకరాలలోని పంట నీటి మునిగి దాదాపు రూ. 2కోట్ల మేర పంటనష్టం జరిగిందని జేసీకి వివరించారు. భూమిని సర్వే చేయకుండా, భూమిని రైతుల నుంచి కోనుగోలు చేయకుండా నీటిని ఎలా నిలుపుతారని వారు ప్రశించారు. జీడీపీ కట్ట ఎత్తు పెంచతుండడంతో నీటి నిల్వ శాతం కూడా ఒక టీఎంసీ పెరగుతుందని, అందుకుగానూ మరో 627 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు సర్వే చేశారని చెప్పారు. ఈ భూమిని కోల్పోయే రైతులకు భూమికి బదులు భూమితో పాటు రైతు కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జేసీకి వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన జేసీ మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు 376 మీటర్ల లోపే నీటిని నిలుపే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. భూమి కొనుగోలు కు సంబంధించిన ఫైల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఉందని, దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

రైతుల మాటల్లో..

ఎన్నెకండ్ల గ్రామానికి చెందిన ఐరన్‌బండ మాజీ సర్పంచ్‌ బజారి మాట్లాడుతూ తనకు నాలుగు ఎకరాల భూమి ఉందని, అందులో వేరుశనగ, వరి, ఉల్లి, పంటలను సాగు చేశానని చెప్పారు. జీడీపీ నీటిలో పూర్తి గా మునిగి పోయి దాదాపు రూ. 2.50 లక్షల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చచేశారు. ఏటా ఇలాంటి దుస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరన్‌బండ గ్రామ రైతు వీరేశ్‌ మాట్లాడుతూ అఽధికారులు, నాయకులు స్పందించి భూమి సర్వే చేసి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల అభిప్రాయాలు లేకుండా సర్వేలు చేయడం భూమికి ధర నిర్ణయించడం సరికాదన్నారు. భూమికి భూమి కాని, మర్కెట్‌ ధర కాని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 05 , 2025 | 12:02 AM