పరీక్షలు సజావుగా నిర్వహిస్తాం: డీఆర్వో
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:57 PM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి సమస్యలేకుండా సజావుగా నిర్వహిస్తామని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని డీఆర్‌వో రామునాయక్ ఆదేశించారు.

నంద్యాల ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి సమస్యలేకుండా సజావుగా నిర్వహిస్తామని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని డీఆర్‌వో రామునాయక్ ఆదేశించారు. రీజనల్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షలపై సమీక్షించారు. అనంతరం డీఆర్‌వో మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 458 పాఠశాలలకు చెందిన 25,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, అందులో 24,773 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా, 769 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. 130 పరీక్షా కేంద్రాలకు 130మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 130మంది శాఖాధికారులు, ఐదు ఫ్లయింగ్‌స్వ్కాడ్లను నియమిస్తున్నట్లు వివరించారు. ఏపీవోఎస్‌ఎస్ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మార్చి 3వతేదీ నుంచి 15వతేదీ వరకు, మార్చి 3వతేదీ నుంచి 15వతేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నట్లు తెలియజేశారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఐఈవో సునీత, డీవైఈవోలు శంకర్‌ప్రసాద్, వెంకట్రామిరెడ్డిలతో పాటు ఎంఈవోలు పాల్గొన్నారు.