ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:55 AM
ఇల్లు లేని ప్రతి అర్హత కల్గిన కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం కోసమే పీఎంఏవై పథకమని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇల్లు లేని ప్రతి అర్హత కల్గిన కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం కోసమే పీఎంఏవై పథకమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ శేషన్న, హౌసింగ్ పీడీ శ్రీహరిగోపాల్‌తో కలిసి కలెక్టర్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అంగీకార్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ఆధార్, రేషన్‌కార్డు కల్గి ఎన్‌బీఎం పోర్టల్‌లో అర్హులుగా గుర్తింపు పొందిన వారికి పీఎంఏవై అర్బన్ - ఎన్‌టీఆర్ నగర్ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం రూ.1.5లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ రూ.1లక్ష కలిపి మొత్తం రూ.2.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 4న ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలను హౌసింగ్ నెలలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇల్లులేని పేదలను గుర్తించి గృహ యజమానులుగా చేయడం, బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పించడం, రిజిస్ట్రేషన్ చేయించడం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ప్రధాన అంశాలుగా కొనసాగనున్నాయని వివరించారు.