మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:42 PM
శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం(ఆత్మకూరు), జనవరి 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక సమావేశ మందిరంలో దేవస్థానం వైదిక కమిటీ, ఇంజనీరింగ్, పలు శాఖాధిపతులు, విభాగాల పర్యవేక్షకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో మహాశివరాత్రి ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో మెలగాలన్నారు. ప్రతిఒక్క ఉద్యోగి భక్తుల సౌకర్యాల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. దర్శన క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు పోలీసుశాఖ సహకారం తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు నుంచే క్షేత్రానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, కల్యాణోత్సవం, 27న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలను దిగ్విజయంగా జరపాలన్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అటవీశాఖతో సమన్వయమై నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలసద్వారం, సాక్షిగణపతి తదితర చోట్ల ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో రమణమ్మ, స్వామివార్ల ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయస్వామి, ఉమామహేశ్వరశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.