Share News

ఎస్‌డీపీఐ కార్యాలయంలో ఈడీ సోదాలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:07 AM

నంద్యాల ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కార్యాలయంపై గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫరూక్‌నగర్‌లోని ఎస్‌డీపీఐ కార్యాలయం వద్ద ఉన్నట్లుండి ఈడీ అధికారులు, ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు కంగారుపడ్డారు.

ఎస్‌డీపీఐ కార్యాలయంలో ఈడీ  సోదాలు
కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు

ఎస్‌డీపీఐ సభ్యులకు, ఈడీ బృందానికి మధ్య వాగ్వాదం

ప్రత్యేక పోలీసు బలగాల ఆధీనంలో ఎస్‌డీపీఐ కార్యాలయం

దాదాపు 5గంటలపాటు సాగిన సోదాలు

వక్ఫ్‌ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే : ఎస్‌డీపీఐ నాయకులు

నంద్యాల క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కార్యాలయంపై గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫరూక్‌నగర్‌లోని ఎస్‌డీపీఐ కార్యాలయం వద్ద ఉన్నట్లుండి ఈడీ అధికారులు, ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు కంగారుపడ్డారు. ఈడీ అధికారులు ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించడంతో ఎస్‌డీపీఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన నలుగురు ఈడీ అధికారుల బృందాన్ని ఎస్‌డీపీఐ కార్యకర్తలు ఆఫీసు తాళాలు తెరవకుండా అడ్డుపడ్డారు. దీంతో నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తన పోలీస్‌ బృందంతో వారిని వారించి తాళాలు తెరిపించారు. ఎస్‌డీపీఐ కార్యాలయాన్ని ప్రత్యేక పోలీసు బలగాలతో తమ ఆధీనంలోకి తీసుకొని సోదా చేశారు. ఈడీ సోదాలు మధ్యాహ్నం 1నుంచి సాయంత్రం 5.25 వరకు జరిగాయి. ఈడీ సోదాల్లో ఎటువంటి ఆధారాలు, డాక్యుమెంట్లు లభించకపోవడంతో ఈడీ బృందం పంచనామా నిర్వహించి వెళ్లిపోయారు. ఈడీ అధికారులు వెళ్లే సమయంలో ఎస్‌డీపీఐ కార్యకర్తలు వారి వాహనాలకు అడ్డుపడ్డారు.

ఈ సందర్భంగా వారు ఈడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ చట్టం బిల్లును ఎస్‌డీపీఐ వ్యతిరేకించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నంద్యాల అసెంబ్లీ ఇన్‌చార్జి ఫాజిల్‌ దేశాయ్‌ ధ్వజమెత్తారు. సోదాలకు భయపడే ప్రసక్తేలేదని న్యాయపరంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Mar 07 , 2025 | 12:07 AM