Share News

ముంచుతున్న మోసగాళ్లు

ABN , Publish Date - Mar 06 , 2025 | 11:38 PM

ముంచుతున్న మోసగాళ్లు

ముంచుతున్న మోసగాళ్లు

అనేక మంది నుంచి రూ.లక్షల్లో స్వాహా

ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదులు

నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలంటున్న ఎస్పీ

నిరుద్యోగం పెరిగేకొద్దీ మోసగాళ్లు కొత్త వేషాలతో ముందుకు వస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని... అమేజాన్‌ కంపెనీలో ఆఫర్‌ వచ్చిందని.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా ఛాన్స్‌ ఇప్పిస్తామని, రైల్వేశాఖలో పెద్ద పోస్టు ఉందని, మీ కోసం కోర్టుల్లో జాబ్స్‌ ఉన్నాయని నమ్మించి నిరుద్యోగులను మోసం చేస్తుంటారు. ఇట్లాంటివి వెలుగులోకి వచ్చే కొద్దీ ఎన్ని రకాలుగా మోసాలు జరిగేదీ తెలుస్తున్నది. అమాయక నిరుద్యోగులను మోసం చేస్తూ భారీ ఎత్తున నగదును కాజేస్తున్న ఉదంతాలు నిత్యం జరుగుతున్నాయి. బిడ్డలను కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మరోసారి ఇలాంటి దళారుల మాటలు నమ్మి తమ కష్టార్జితాన్ని ధారపోస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం వస్తే పిల్లలు సెటిల్‌ అవుతారనే ఆశతో వంచకుల వలలో పడుతున్నారు. ఈ సెగ పోలీసు శాఖకు సైతం చేరింది. ఉద్యోగాల ఇప్పిస్తామని ఎవరూ నమ్మి డబ్బులు ఇవ్వద్దంటూ పలు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా.. నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో మాత్రం చలనం రావడం లేదు.

కర్నూలు క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం మాయ మాటలు నమ్మి, డబ్బు ఇచ్చి మోసపోతున్న వాళ్లు ఎస్పీ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి సోమవారం కనీసం 9 నుంచి 10 దాకా ఫిర్యాదులు ఈ తరహా మోసాలపైనే ఉంటున్నాయి. కింది స్థాయి ఇచ్చిన పోలీస్‌ స్టేషన్‌లలో తాము ఇచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చూపకపోవడంతోనే బాధితులు ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ఎస్పీ వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో కూడా కొన్నింటికి మాత్రమే పరిష్కారం దొరుకుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ రైతు కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నట్లు ఇటీవల సంఘటనలను బట్టి చూస్తే తెలుస్తున్నది. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతనే ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని అధికారులు చెబుతున్నా.. కొందరు ఇట్లా మోసపోతూనే ఉన్నారు.

నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ, ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తారు. కానీ కొందరు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపిస్తారు. బాగా తెలిసిన వ్యక్తులే నమ్మిస్తారు.. ఆ తర్వాత మొఖం చాటేస్తారు. అటు ఉద్యోగం రాక.. ఇటు డబ్బులు రాక పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా సాప్ట్‌వేర్‌, బ్యాంకు ఉద్యోగాలు, కోర్టు, రైల్వే ఉద్యోగాలంటూ మోసం చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి

ఇటీవల వచ్చిన కొన్ని ఫిర్యాదులు

రూ.3.50 లక్షలు తీసుకుని అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి వెంకటాపురం చెందిన శేఖర్‌, సుధాకర్‌ మోసం చేశారని దేవరకొండ మండలం, బేతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కర్నూలు చెందిన వీరాస్వామి అనే వ్యక్తి రూ.8 లక్షలు, 5 తులాల బంగారు తీసుకుని హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని ఆర్‌కే స్ర్టీట్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

కర్నూలు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురానికి చెందిన సాదిక్‌ వలి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు విద్యానగర్‌కు చెందిన సందీప్‌ చంద్రపాల్‌ ఫిబ్రవరి 10న ఎస్పీని ఆశ్రయించాడు.

ఢిల్లీకి చెందిన ఆశా ఠాకూర్‌ అనే వ్యక్తి తన కొడుకు సురేష్‌కు కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి పంపిస్తామని ఫీజుల పేరుతో రూ.1.6 లక్షలు కట్టించుకుని మోసం చేశాడని కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు.

బెంగుళూరుకు చెందిన మనీషా జాబ్‌ కన్సల్టెన్సీ అనే సంస్థ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.3 లక్షలు తీసుకుని కర్నూలు ఎన్‌ఆర్‌పేటకు చెందిన సమీర్‌ ఫిబ్రవరి 3న ఫిర్యాదు చేశారు.

హైదరాబాదులో గుడ్‌క్రాఫ్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన చంద్రశేఖర్‌ నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.2.60 లక్షలు తీసుకుని 3 నెలల పాటు పని చేయించుకుని జీతం లేకుండా, అసలు ఉద్యోగమే ఇప్పించకుండా మోసం చేశాడని కర్నూలు పార్వతీనగర్‌కు చెందిన కురువ ఆంజనేయులు, ఈశ్వర్‌ ఫిబ్రవరి 3న ఎస్పీని ఆశ్రయించారు.

కర్నూలుకు చెందిన హసీనా బేగం, మహబూబ్‌ బాషా కలిసి కర్నూలులోని మద్దూరునగర్‌లో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారని, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.80 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు ఎల్బీఎస్‌ నగర్‌కు చెందిన వీర అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి జనవరి 20 ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.

గత ఏడాది చివరి మూడు నెలల్లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...

బెంగుళూరు చెందిన ఒరిజిన్‌ ఇన్‌ఫో టెక్నాలజీ కియోస్క్‌ కంపెనీలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాదులో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌, రాకేష్‌, అశ్విని, కిరణ్‌ కుమార్‌ కలిసి మోసం చేశారని కర్నూలు ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి డిసెంబరు 2న ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను నమ్మి 25 మంది రూ.50లక్షలు దాకా ఇచ్చారని, 2నెలల పాటు బెంగుళూరులో జీతాలు ఇచ్చి కంపెనీలు తీసివేసి మోసం చేశారని ఆమె తెలిపారు.

డిసెంబరు 9న కర్నూలు రేడియో స్టేషన్‌లో అటెండరు ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌ రూ.18లక్షలు తీసుకుని మోసం చేశారు.

ఎదురూరు గ్రామానికి చెందిన శివకుమార్‌, జోహరాపురానికి చెందిన శ్రీనివాసులు రైల్వేస్టేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని, ఏవీఆర్‌ ఇన్‌ఫోటిక్‌ అనే పేరుతో ఐడీ కార్డు ఇచ్చి మోసం చేశారని కల్లూరుకు చెందిన ప్రసాద్‌ డిసెంబరు 9న ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని శివాజీ అనే వ్యక్తి మోసం చేశాడని నూతనపల్లె గ్రామానికి చెందిన వంశీనాథ్‌ డిసెంబరు 9న ఫిర్యాదు చేశారు.

బీటెక్‌ పూర్తి చేసిన తనకు హైదరాబాద్‌ ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. పందిపాడు గ్రామానికి చెందిన సాయికిరణ్‌ రూ.3.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని పసుపుల గ్రామానికి చెందిన సాయికిరణ్‌ డిసెంబ రు 16న ఫిర్యాదు చేశారు.

అదే రోజు బెంగుళూరు ఐటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో జాబ్‌ ఇప్పిస్తామని చెప్పి చరణ్‌రెడ్డి పేరుతో ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమై రూ.40వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు వడ్డేగేరికి చెందిన ఆసీఫ్‌బాషా ఎస్పీకి ఫిర్యాదు.

పత్తికొండ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలు చెందిన శ్రావణ్‌ కుమార్‌, మధుకిరణ్‌ రూ.1.75 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండ మండలం బుగ్గతాండ గ్రామానికి చెందిన శివ నాయక్‌ డిసెంబరు 23న ఫిర్యాదు చేశారు.

కర్నూలు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో తన కుమారుడికి, కుమార్తెకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ఆయేషాబేగం, జహీర్‌ రూ.5.75 లక్షలు తీసుకుని మోసం చేశారని, కర్నూలు వివేక్‌నగర్‌కు చెందిన ఉదయ్‌ కుమార్‌ సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఉద్యోగాలు పోటీలు పరీక్షలు, ప్రతిభ ఆధరాంగానే వస్తాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా ఎంచుకుని దళారులు మోసాలు చేస్తున్నారు.

-విక్రాంత్‌ పాటిల్‌, ఎస్పీ

Updated Date - Mar 06 , 2025 | 11:38 PM