తాగునీటికి కటకట
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:50 PM
మండలంలోని ఏనుగుబాల, గార్లదిన్నె, కందనాతి, మసీదుపురం, మల్కాపురం తదితర గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బం దులు తప్పడం లేదు.
ఎమ్మిగనూరు రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏనుగుబాల, గార్లదిన్నె, కందనాతి, మసీదుపురం, మల్కాపురం తదితర గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రతి కార్యక్రమంలో సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, తాగునీటి సరఫరా చేసే కాంట్రాక్టర్ల అలసత్వంతో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో కొళాయిలకు మోటార్లు ఏర్పాటు చేసుకుంటుండడంతో కేవలం కొంతమందికి మాత్రమే నీరు అందుతోంది. మిగతా ప్రజలు తాగునీటి కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న బోరు, బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.