Share News

మహబూబ్‌నగర్‌-డోన్‌ మధ్య డబ్లింగ్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:29 AM

మూడు దశాబ్దాల స్వప్నం సాకారమవుతుందని నమ్మకం కలిగిన వేళ. పెండింగ్‌లో ఉన్న మహబూబ్‌ నగర్‌ - డోన్‌ వయా కర్నూలు రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖ నుంచి వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

మహబూబ్‌నగర్‌-డోన్‌ మధ్య డబ్లింగ్‌

వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఊతం

రూ.241.99 కోట్లతో ఆదోని బైపాస్‌ రోడ్డు

మూడు దశాబ్దాల స్వప్నం సాకారమవుతుందని నమ్మకం కలిగిన వేళ. పెండింగ్‌లో ఉన్న మహబూబ్‌ నగర్‌ - డోన్‌ వయా కర్నూలు రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖ నుంచి వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల ప్రజలకు మెరుగైన రైల్వే రవాణా సౌకర్యం కలుగుతుంది. రైల్వే రవాణా మెరుగుపడితే ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ కారిడార్‌ బలోపేతం అవుతుంది. ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. తద్వారా కరువు ప్రాంతమైన కందనవోలు ముంగిట నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్లేందుకు సమయం కలిసి వస్తుంది. రైళ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే.. ఆదోని బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆదోని పట్టణ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరునున్నాయి. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో సికింద్రాబాద్‌ నుంచి నంద్యాల జిల్లా డోన్‌ వయా మహాబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూలు ప్రధాన రైలు మార్గం ఇది. 295 కి.మీలు పొడువు ఉండే ఈ రైలు మార్గాన్ని 1922లో ఆనాటి బ్రిటీష్‌ ప్రభుత్వం మీటర్‌-గేజ్‌ లైన్‌గా పనులు ప్రారంభించారు. 1929లో పనులు పూర్తి చేశారు. స్వాతంత్య్రం అనంతరం 1993-98 మధ్య బ్రాడ్‌-గేజ్‌ రైలు మార్గంగా మార్చారు. ఆ తరువాత విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం విద్యుత్‌ రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయతే.. సింగిల్‌ లైన్‌ కావడంతో రవాణాలో తీవ్ర జాప్యం కలుగుతోంది. ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పుడు ఆయా రైల్వే స్టేషన్లలో పాసింగ్‌ కోసం రైళ్లను ఆపేస్తున్నారు. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో కీలకమైన ఈ రైలు మార్గానికి డబ్లింగ్‌ (రెండు రైలు మార్గాలు) ఏర్పాటు సహా విద్యుదీకరణ చేయాలనే మూడు దశాబ్దాలుగా రైల్వే ప్రయాణీకులు విన్నవిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 295 కి.మీలు డబ్లింగ్‌, విద్యుదీకరణ చేయాలని ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో రైల్వే ప్రయాణికుల ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి. 2014లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రైలు మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందులో భాగంగా 2016-17లో సికింద్రాబాద్‌ - మహబూబ్‌నగర్‌ మధ్య 85 కి.మీలు డిబ్లింగ్‌ రైలు మార్గం, విద్యుదీకరణ పనులకు రూ.774 కోట్లతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే కాకుండా 2022 నాటికి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ మర్గాంలో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి.

మహబూబ్‌నగర్‌-డోన్‌ మధ్య డబ్లింగ్‌కు మోక్షం

రాయలసీమ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్‌నగర్‌ - డోన్‌ వయా గద్వాల, కర్నూలు, వెల్దుర్తి మధ్య 197 కి.మీల డబ్లింగ్‌ రైల్వే లైన్‌ నిర్మాణం, విద్యుదీకరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రూ.2,208 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ విశాఖ కేంద్రంగా వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ మార్గం నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఏపీలో కర్నూలు, నంద్యాల జిల్లాలో 54 కి.మీలు, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధివలో 143 కి.మీలు డబ్లింగ్‌ రైలు మార్గం నిర్మించనున్నారు. ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ కారణంగా హైదాబాద్‌ వెళ్లాలంటే మహాబూబ్‌నగర్‌ వరకు పాసింగ్‌ కోసం ఏ రైలును ఏ రైల్వే స్టేషన్‌లో ఆపేస్తారో తెలియని పరిస్థితి. పాసింజర్‌ రైలును అయితే గంటల కొద్ది ఆపేస్తున్నారు. ఫలితంగా కర్నూలు నుంచి హైదారాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలంటే 5.30 గంటలకు పైగా సమయం పడుతుంది. డబ్లింగ్‌ పనులు పూర్తయితే 3-3.30 గంటల్లోగా చేరుకోవచ్చని రైల్వే అధికారులు అంటున్నారు. అదే క్రమంలో హైదరాబాద్‌-బెంగళూరు వయా కర్నూలు మధ్య నడుపుతున్న వందేభారత్‌ రైలు మరింత తక్కుత సమయంలో గమ్యస్థానం చేరుకుంటుందని అంటున్నారు.

పారిశ్రామిక ప్రగతికి ఊతం

పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే రైలు మార్గం ఎంతో కీలకం. ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.2,850 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ పరిశ్రమలు ఏర్పాటుకు సన్నహాలు చేస్తుంది. అందులో భాగంగానే జపానీస్‌, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో రూ.14 వేల కోట్ల పెట్టుబడితో సెమి కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు దాదాపు ఓకే చేశారు. పెండింగ్‌లో ఉన్న మహబూబ్‌నగర్‌ - డోన్‌ వయా కర్నూలు ప్రధాన రైలు మార్గాన్ని డబుల్‌ లైన్‌, విద్యుదీకరణ పూర్తయితే పరిశ్రమ ఏర్పాటుకు మరింత ఊతం ఇచ్చినట్లవుతుంది. . కర్నూలు నుంచి ఓర్వకల్లుకు 18-20 కి.మీలు దూరం మాత్రమే ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అదే క్రమంలో ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామిక ప్రగతి వేగంగా అభివృధ్ధి చెందాలంటే కర్నూలు-నంద్యాల వయా ఓర్వకల్లు రైలు మార్గం నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఆదోనివాసుల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

ఆదోని ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ ప్రధాని మోదీ రూ.241.99 కోట్లతో నిర్మించే ఆదోని బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. పదేళ్లకు పైగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హగరి నుంచి తెలంగాణ రాష్ట్ర జడ్చర్ల వరకు వయా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూరు మీదుగా జాతీయ రహదారి-167 నిర్మాణం పనులు చేపట్టారు. ఆదోని నుంచి మంత్రాలయం వరకు ఎమ్మిగనూరు మీదుగా చేపట్టిన పనులు 2012-13లో పూర్తయ్యాయి. ఆదోని పట్టణంలో ఈ జాతీయ రహదారి వెళ్తుంది. ట్రాఫిక్‌ సమస్యలు దృష్ట్యా ఆదోని-ఆలూరు రోడ్డు నుంచి ఎమ్మిగనూరు రోడ్డు వరకు 7.3 కి.మీల బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల తారు (బీటీ) రోడ్డు, రెండు వైపుల 2 మీటర్లు మట్టిరోడ్డు (సోల్డర్‌) నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు, ఇంటి స్థలాలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:29 AM