Share News

నీలితొట్లవీధిలో ఆగని అతిసార..!

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:15 AM

ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్లవీధిలో కలుషిత నీటి కారణంగా ప్రబలిన అతిసార ఆరు రోజులైనా తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ముగ్గురు అతిసారతో మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతోపాటు తాజాగా మరికొంత మంది అతిసార లక్షణాలతో బాధపడుతూ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నీలితొట్లవీధిలో ఆగని అతిసార..!
ఆత్మకూరు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న బాధితులు

మరికొంత మందికి అస్వస్థత

బాధితులకు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం

కాలనీల్లో యుద్ధప్రాతిపదికన కొత్త పైపులైన్‌

ఆత్మకూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్లవీధిలో కలుషిత నీటి కారణంగా ప్రబలిన అతిసార ఆరు రోజులైనా తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ముగ్గురు అతిసారతో మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతోపాటు తాజాగా మరికొంత మంది అతిసార లక్షణాలతో బాధపడుతూ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలనీకి సరఫరా జరిగే తాగునీటిని పరీక్షించిన అధికారులు తొలుత కలుషితం జరగలేదని ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కర్నూలు రీజనల్‌ ల్యాబ్‌లో వెల్లడైన నివేదికలో ఓ ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లో ప్రాణాంతకమైన ఈ-కోలీ బ్యాక్టిరియా ఉన్నట్లు గుర్తించారు. దీంతో నీలితొట్లవీధితో పాటు సమీప కాలనీల ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. వైద్యులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జబ్బుపడిన వారిని ఆత్మకూరు సామాజిక వైద్య కేంద్రానికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని కర్నూలు జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా మంగళవారం నాటికి కర్నూలులోని ఆసుపత్రుల్లో నూర్‌అహ్మద్‌, గాయత్రి, రమిజాబీ, హిమామ్‌బీ, షహనాజ్‌బీ చికిత్స పొందుతుండగా ఆత్మకూరు సామాజిక వైద్య కేంద్రంలో షాహిదాబీబేగం, సయ్యద్‌ జిలేకాబీ, ఖాదర్‌వలి, శ్రీనివాసగౌడ్‌ వైద్యసేవలు పొందుతున్నారు. ఇదిలావుంటే నీలితొట్లవీధిలో అతిసార ప్రబలడంతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మున్సిపల్‌ కార్మికులు ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. అలాగే నీలితొట్లవీధితో పాటు సమీప కాలనీలకు పైపులైన్ల ద్వారా నీటిసరఫరా నిలిపి వేసి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్‌ రత్నరాధిక, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నీలితొట్లవీధిలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 24గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు.

ముగ్గురి మరణాలకు బాధ్యులెవరూ..?

ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్లవీధిలో రహంతుల్లా(50), బషిరూన్‌బీ (60), గొల్లపేటలో రామచంద్రుడునాయక్‌ (60) తాగునీరు కలుషితం కావడంతో అతిసార ప్రబలి మరణించారని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే తొలుత కాలనీలో తాగునీటి కలుషితం జరగలేదని ఏకంగా కలెక్టరే ప్రకటించారు. కానీ ప్రస్తుతం ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లో ప్రాణాంతకమైన బ్యాక్లిరియా ఉన్నట్లు తేలడంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆ ముగ్గురు మరణాలకు బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:15 AM