సీఎం దృష్టికి దేవస్థానం సమస్యలు : మంత్రి ఆనం
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:57 PM
శ్రీశైలం దేవస్థానం పరిధిలో చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

సున్నిపెంట, 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానం పరిధిలో చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీరుకు స్వాగతం పలికేందుకు వచ్చిన మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా కాలంగా శ్రీశైలంలో భూ వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. శ్రీశైలం అభివృద్ధిలో భాగమైన మాసర్ ప్లాన్ రూపకల్పనపై ప్రభుత్వం ప్రతేక దృష్టి సారించిందని తెలిపారు. క్షేత్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన మర్గదర్శకాలు రూపొందించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. క్యూలైన్ల వద్దకు వెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఉన్నారు.