Share News

డీసీసీలో కలకలం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:02 AM

కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం కబ్జాకు కుట్ర చేశారా..? అధిష్ఠానం అనుమతులు లేకుండా కళా వెంకట్రావు భవన్‌ పేరిట ప్రైవేటు సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటీ..?

డీసీసీలో కలకలం

ఏపీసీసీ అనుమతి లేకుండా వ్యవహారం

కబ్జా కుట్రలో భాగమే సొసైటీ రిజిస్ట్రేషన్‌

నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌

ఈకేవైసీ కోసమే సొసైటీ : కర్నూలు డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ

కర్నూలు డీసీసీ ఆస్తుల విలువ రూ.16 కోట్ల పైమాటే

పోలీసులకు ఫిర్యాదు చేసిన నేతలు

విచారణకు ఆదేశించిన ఏపీ సీసీ అధ్యక్షురాలు షర్మిల

కర్నూలు/కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం కబ్జాకు కుట్ర చేశారా..? అధిష్ఠానం అనుమతులు లేకుండా కళా వెంకట్రావు భవన్‌ పేరిట ప్రైవేటు సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటీ..? జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మురళీకృష్ణ ఒక్కడే ఈ నిర్ణయం తీసుకున్నారా..? దీని వెనుక రాష్ట్ర నేతలు ఎవరైనా ఉన్నారా..? ఆ పార్టీలో ప్రఽధానంగా చర్చ జరుగుతోంది. 66 ఏళ్ల చరిత్ర కలిగిన కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం (కళా వెంకట్రావ్‌ భవన్‌) స్థలం విలువ రూ.16 కోట్లు పైమాటే. ఇప్పటి వరకు డీసీసీ పేరిట కార్యకలాపాలు సాగించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏ ఒక్కరు కూడా ప్రైవేటు సొసైటీ పేరిట మార్చేందుకు ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ అధ్యక్షుడిగా ఏడుగురితో ప్రైవేటు సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేయించడం ఆ పార్టీలో కలకలానికి కారణమైంది. దీనిపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదేశించారు. దీంతో ఆ పార్టీ నేతలు గురువారం కర్నూలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (కళా వెంకటరావ్‌ భవన్‌)కు 66 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ భవనం కేంద్రంగా పని చేసిన నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. కేంద్ర మంత్రులుగా పని చేశారు. అంతటి చరిత్ర కలిగిన కార్యాలయం కబ్జా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగరం నడిబొడ్డున చరిత్రాత్మక కొండారెడ్డి బురుజుకు అతిసమీపంలో దాదాపు 0.33 ఎకరాల్లో (33 సెంట్లు) ‘కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ’ కార్యాలయం నిర్మాణం కోసం 1959 జూలై 16న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పునాదిరాయి వేశారు. నాటి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష్యుడు మద్దూరు సుబ్బారెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పోలాది రామయ్యలు ఎంతో కృషి చేశారు. ఈ భవనం నిర్మాణం కోసం మూడేళ్లు శ్రమించారు. 1962 ఫిబ్రవరి 6న నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కృషి ఉంది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులుగా పని చేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డిలు ఈ కార్యాలయం కేంద్రంగా రాజకీయంగా చక్రం తిప్పారు. 1950 నుంచి నేటి వరకు 17 మంది జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పని చేశారు.

కబ్జా చేసేందుకు ఎత్తుగడ

టూటౌన్‌ పోలీసులకు నేతల ఫిర్యాదు

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల ను డీసీసీ పి.మురళీకృష్ణ కబ్జా చేసేందుకు ఎత్తుగడ వేశాడని ఏఐసీసీ సభ్యులు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మి నరసింహయాదవ్‌ ధ్వజమెత్తారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ డీసీసీ కె. బాబురావు, నగర అధ్యక్షుడు జిలానీ బాషా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.బ్రతుకన్న, సీనియర్‌ నాయకులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళా వెంకట్రావ్‌ భవన్‌ పేరుతో రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో ఓ సొసైటీని ఏర్పాటు చేసి ఆస్తులకు తానే యాజమానిగా సృష్టించుకునేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆ సోసైటీలో కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పని చేసే గుమాస్తాలు, స్వీపర్లను సభ్యులుగా చేర్చడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించారు. రాష్ట్ర, జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలుకు తెలియకుండా, కనీసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా సొంత నిర్ణయా లు తీసుకోవడంతో కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన ఆదాయ వనరులను రాష్ట్ర పీసీసీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారన్నారు. గత 70 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆదాయాలను కాంగ్రెస్‌ పార్టీ అవసరాలకు మాత్రమే ఉపయోగించే వారని, జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి 15 వాణిజ్య సముదాయాలు ఉండగా వాటి ద్వారా నెల వారి రూ.1.87 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. వాటిని కూడా సొంత అవసరాలకు వాడుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు రోజులుగా పీసీసీ ఆదేశాల మేరకు పి.మురళీకృష్ణ చేసిన అక్రమాలపై విచారణ జరిపిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశా మన్నారు. అక్రమ సొసైటీని రద్దు చేయాలని రిజిస్ర్టేషన్‌ శాఖ డిఐజీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదే విషయంపై డీసీసీ మురళీకృష్ణను సమావేశానికి ఆహ్వా నించగా ఆయన వచ్చేందుకు నిరాకరించాడన్నారు. మాజీ డీసీసీ కె.బాబు రావు మాట్లాడుతూ డీసీసీ పదవిలో కూర్చున పి.మురళీకృష్ణ దళితుల పరువు తీశాడని మండి పడ్డారు. జిల్లా కేంద్రలో ఉన్న తమ కళ్లు గప్పి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అఽఽధ్యక్షులు జిలానీ బాషా, నాయకులు అనంతరత్నం, ముర్షిద్‌పీర్‌ ఖాద్రీ, రియాజ్‌, రజాక్‌ వలి, పఠాన్‌ ఖాన్‌, విశ్వేశ్వర రెడ్డి, చెన్నయ్య, సదానందం, వెంకటరెడ్డి, లాజరస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈకేవైసీ కోసమే సొసైటీ ఏర్పాటు

షర్మిలకు ఏం సంబంధం: డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ

ఈకేవైసీ కోసం కళావెంకట్రావ్‌ భవన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ను సోసైటీని రద్దు చేసుకున్నామని డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ పరువు తీసే విధంగా నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మి నరసింహయాదవ్‌, నగర అధ్యక్షుడు జిలానీ బాషాల వ్యవహరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దశ..దిశ ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరువు బజారున పడకుండా ఏదైనా ఉంటే సర్దు బాటు చేసుకుందామని వారికి సూచించానని తెలిపారు. సరే కేసు పెట్టారు... చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చివరకు మీరే అవమాన పడాల్సి వస్తుందన్నారు. 2008 నుంచి యూత్‌ కాంగ్రెస్‌ పార్టీలో పని చేశా.. పార్టీ అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తులు అవసరం లేదని తెలిపారు. ‘ఈ విషయంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మను ఎందుకు లాగుతున్నారు. ఆమెకు ఏం సంబంధం’ అని ప్రశ్నించారు. గత ఏడాది సెప్టెంబరు 14న కమిటీ చేసిన సిఫారసు ఆధారంగానే సొసైటీని రిజిస్ట్రేషన్‌ చేశామని తెలిపారు. అనంతరం ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బజారన్న మాట్లాడుతూ నంద్యాల డీసీసీ, కర్నూలు నగర అధ్యక్షులు జిలానీ బాషాలు ఇద్దరు కించ పరిచే విధంగా తన పేరు ప్రస్తావించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.

విచారణకు పీసీసీ ఆదేశం

కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, మాజీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజుకు పీసీసీ షర్మిల రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయ భవన సముదాయాలకు సంబంధించి పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నిక్కచ్చిగా నివేదిక ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ సొంత ఆస్తులుగా రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి పార్టీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లను చేర్చి అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏపీసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించారు. వాస్తవాలు, పార్టీ ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీకి సమర్పించాలని కోరినట్లు షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 12:02 AM