ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:51 PM
ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.

కలెక్టర్ రాజకుమారి
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 03 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై సబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌లుగా డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలని డీఆర్వోను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. సంబంధిత పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అఽధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటి సంవత్సరం 14,272 మంది జనరల్ విద్యార్థులు, 1418 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 15,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రెండో సంవత్సరం 12,271 జనరల్ విద్యార్థులు, 1129 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 13,400 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్, తాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీప్ జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మిషన్లు మూసి వేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డీఐఈఓ సునీత, ఇంటర్ పరీక్షల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులు నాణ్యతతో పరిష్కరించండి
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో 198 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్‌ఎల్‌ఏ లోగా పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నులిపురుగుల నివారణ మాత్రలను మింగించండి
విద్యార్దులకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. నులిపురుగు నివారణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల దినాన్ని పురస్కరించికొని 1-19 సంవత్సరాల లోపు విద్యార్ధులదరికీ నులిపురుగుల నివారణ మాత్రలు మింగించాలని ఆదేశించారు. నంతరం నులిపురుగుల నివారణపై ముద్రించిన గోడపత్రికలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.వెంకటరమణ, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. కాంతారావు నాయక్ విడుదల చేశారు.