పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:00 AM
పోషకాహార లోపంతో ఎదుగుదల లేని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు పౌష్టికాహారం అందించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారనీ జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య అన్నారు.

జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పోషకాహార లోపంతో ఎదుగుదల లేని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు పౌష్టికాహారం అందించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారనీ జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అంగన్‌వాడీ శిశువుల ఆరోగ్య పరిరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మలతో కలిసి జేసీ ప్రారంభించారు. పిల్లల వయస్సుకు తగ్గ బరువు, పొడవులను కొలిచి జాయింట్ కలెక్టర్‌కు సూపర్‌వైజర్లు, సీడీపీవో, అంగన్‌వాడీ కార్యకర్తలు చూపించారు. ఈ సందర్భంగా జేసీ డా.బి. నవ్య మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలును, గర్భిణులు, బాలింతలకు మంచి పోషకాహారం అందిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ పిల్లల వయస్సు, పొడవు, బరువు సక్రమంగా రికార్డు చేసి పోషణ ట్రాకర్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ నిర్మల మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది పిల్లల కొలతలు తీసుకుని అవి వారి వయస్సుకు తగ్గ విధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలన్నారు. పిల్లల బరువు, పొడవులు కొలిచే సాధనాలైన ఇన్పేంటో, స్టిడో మీటర్ల ద్వారా ప్రత్యక్షంగా పిల్లల బరువు పొడవు కొలుచు విధానాన్ని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కోడుమూరు, వెల్దుర్తి, కర్నూలు ప్రాజెక్టులకు చెందిన సీడీపీవోలు వరలక్ష్మి, అనురాధ, మద్దమ్మ, బాలమ్మ, నరసమ్మ, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.