నీటి విడుదలకు వసూళ్లు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:56 PM
కరువు పల్లెల క‘న్నీటి’ కష్టాలు తీర్చడానికి కృష్ణా జలాలను అందిస్తున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా ఎత్తిపోసే ఒక టీఎంసీ నీటికి రూ.25 కోట్లకు పైగా కరెంటు బిల్లు ఖర్చవుతుంది.

హంద్రీ నీవా పరిధిలో ఇంజనీర్లు, వైసీపీ నాయకుల అక్రమాలు
ఇదెక్కడి న్యాయం అంటున్న రైతులు
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కరువు పల్లెల క‘న్నీటి’ కష్టాలు తీర్చడానికి కృష్ణా జలాలను అందిస్తున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా ఎత్తిపోసే ఒక టీఎంసీ నీటికి రూ.25 కోట్లకు పైగా కరెంటు బిల్లు ఖర్చవుతుంది. దీనిని అవకాశంగా మార్చుకొని గత వైసీపీ పాలనలో కొందరు ఇంజనీర్లు, ఆ పార్టీ నాయకులు క‘న్నీటి’లో కాసుల వేటకు సిద్ధపడ్డారు. రైతులు నుంచి అక్రమంగా రూ.లక్షలు వసులు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిజాయితీగా రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇందుకు విరుద్ధంగా హంద్రీనీవా కాలువ పరిధిలో ఒకరిద్దరు ఇంజనీర్లు వైసీపీ నేతలతో కుమ్మక్కై అక్రమ వసుళ్లకు పాల్పడడం విమర్శలకు తావిస్తున్నది. దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ వరప్రసాద్ వివరించారు.
కర్నూలు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగానే పత్తికొండ (పందికోన) జలాశయం కుడి (రైట్ బ్యాంక్) కాలువ కింద 50,626 ఎకరాలకు, ఎడమ (లెఫ్ట్ బ్యాంక్) కాలువ కింద 10,774 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. కుడి కాలువ పరిధిలో ప్యాకేజీ-28 కింద జిలేడబుడకల, కరివేముల, కప్పట్రాళ్ల, ప్యాలకుర్తి, తెర్నేకల్లు, నేలబండ, కోటకొండ, నేరుడుపల్లి, గోనెగండ్ల మండలం ఎర్రబాడు, తిప్పనూరు గ్రామాలలో దాదాపుగా 29,200 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. 9 చెరువులకు కృష్ణా జలాలు మళ్లించాలి. వేసవి కాలం రాబోతుండడంతో రైతులు, పశువులకు సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చెరువులు హంద్రీనీవా నీటితో నింపాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, పాణ్యం గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలు హంద్రీనీవా ఇంజనీర్లను కోరారు. మూడు నాలుగు రోజుల క్రితం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గోనెగండ్ల మండలంలోని చెరువులను తక్షణమే నింపాలని, నేనే స్వయంగా చెరువుల వద్దకు వెళ్తానని హంద్రీనీవా ఇంజనీర్లను ఆదేశించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు సహా వివిధ చెరువులు నింపాలని హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ వరప్రసాద్ సంబంధిత ఇంజనీర్లకు ఆదేశించారు. అందులో భాగంగానే పత్తికొండ రిజర్వాయర్ కుడి కాలువ 3.500 కిలోమీటర్ల దగ్గర రైట్‌సైడ్ స్లూయిస్ ద్వారా చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు.
రైతుల నుంచి అక్రమ వసుళ్లు
హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీరు మళ్లించడం ఇంజనీర్ల బాధ్యత. అయితే.. కొందరు ఇంజనీర్లు వైసీపీ నాయకులతో కుమ్మక్కై నీటి విడుదల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. అధికార టీడీపీ కూటమి నాయకులు డబ్బులు ఇవ్వరు.. ఎమ్మెల్యేల ద్వారా ఫోన్లు చేయిస్తారు అనుకున్నారో ఏమో..? ఇంజనీర్లకే ఎరుక. ప్రతిపక్ష వైసీపీ నేతల ద్వారా ఎకరాకు రూ.500 నుంచి రూ.వెయ్యి ప్రకారం వసులు చేయడం విమర్శలకు తావిస్తున్నది. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామం రైతుల నుంచి రూ.లక్షల్లో వసులు చేసినట్లు సమాచారం. దీని వెనుక ఓ డీఈఈ పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇలా వసులు చేసిన డబ్బును కోడుమూరులో పంపకాలు చేశారని అంటున్నారు. ఎర్రబాడు ఒక్కటే కాదు.. ఇతర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కరువుతో తల్లడిల్లుతున్న కష్టజీవుల కన్నీళ్లు తుడవాల్సిన అధికారులే రాజకీయ నాయకులతో కుమ్మక్కై చెరువులకు నీళ్లు విడుదల పేరిట అక్రమ వసులకు పాల్పడడం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయం తెలిసి ఆరోపణులు ఎదుర్కొంటున్న అధికారులపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
విచారించి చర్యలు తీసుకుంటాం
గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామం చెరువుకు హంద్రీనీవా కాలువ నుంచి నీరు విడుదల చేశాం.. చెరువుకు నీరు ఇచ్చేందుకు ఇంజనీర్లు, సిబ్బంది రైతుల నుంచి అక్రమ వసులు చేశారనే ఆరోపణులు వచ్చిన మాట నిజమే. క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కరువు రైతులకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో రూ. కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో ఖర్చు చేసి కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నది. రైతులు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీటి విడుదల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే రాతపూర్వకంగా మా దృష్టికి తీసుకరావచ్చు. వారిపై చర్యలు తీసుకుంటాం.
- వరప్రసాద్, ఎస్‌ఈ, హంద్రీ నీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్