క్లోరినేషన్ తప్పనిసరి: కలెక్టర్
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:02 AM
క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తాగునీరు, పారిశుధ్యం, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తలను వేరు చేయడంతోపాటు తడి చెత్తతో వర్మీకంపోస్టు, పొడి చెత్తతో పేపర్ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి పైప్‌లైన్ల మరమ్మతులు, ఇతర రిపేర్లు ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్‌గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీసీఎన్‌ఎఫ్‌ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్‌ల పెంపకం ముమ్మరం చేయాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ 3వ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, స్థలాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛగ్రీన్ లీఫ్ రేటింగ్‌కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు.