చేపలకు కోళ్ల వ్యర్థాలు!
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:20 AM
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించాలన్న ఉద్దేశంతో చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
చోద్యం చూస్తున్న అధికారులు
గడివేముల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించాలన్న ఉద్దేశంతో చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, కుళ్లిన మాంసం చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి ముంపు వాటిల్లుతున్నా అధికారులు మాముళ్ల మత్తులో ఈ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని గడిగరేవుల, తిరుపాడు, కొరటమద్ది గ్రామాల్లోని కొందరు రైతులు తమ పొలాల మట్టిని గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి విక్రయించారు. పొలాల్లో మట్టిని తవ్వగా ఏర్పడిన భారీ గుంతల్లో కొందరు ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపల సాగు చేపట్టారు. చేపలకు మేతగా వేరుశనగ చెత్త, తవుడు, సోయాబిన్‌మిలెడ్‌లను వాడాల్సి ఉంది. సంప్రదాయ మేతను వేయడం వల్ల నెలకు ఎకరాకు రూ.25 వేల మేర ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. పట్టపగలే ఆటోలు, వ్యాన్‌లలో కోళ్ల వ్యర్థాలను నంద్యాల, గడివేముల నుంచి చేపల చెరువులకు తరలిస్తున్నారు.
చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు
సాధారణ మేత వల్ల చేపలు నెలకు అర కేజీ నుంచి కేజీ పెరిగితే, కోళ్ల వ్యర్థాలు తిన్న చేపలు మరింత బరువు పెరుగుతున్నాయి. సాధారణ మేతతో పోలిస్తే కోళ్ల వ్యర్థాలు తక్కువ ధరకు వస్తుండటంతో కొందరు చేపల చెరువుల యజమానులు వీటినే వినియోగిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని చికెన్ షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి గొర్రెల సంత వద్ద నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి డ్రమ్ములలో చికెన్ వ్యర్థాలను తీసుకొని భారీ వాహనాల ద్వారా చేపల చెరువు వద్దకు చేరవేస్తున్నారు. పట్టపగలే కోళ్ల వ్యర్థాల రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు ఇలా..
కోళ్ల వ్యర్థాలు చేపలకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ 2016లో ప్రభుత్వం జీవో నంబర్ 56ను జారీ చేసింది. ఈ జీవోను అమలు చేసేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, మత్స్య అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో), ఎస్‌ఐ, వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లతో, టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడంతోపాటు డ్రైవర్ లైసెన్స్ రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చేపల చెరువుల రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అమలు చేయాల్సి ఉంది. అయితే మండలంలో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు వేస్తే చర్యలు
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలను వేయడం చట్టరీత్యా నేరం. గడిగరేవుల చేపల చెరువులలో కోళ్ల వ్యర్థాలను వేస్తున్నారన్న సమాచారం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపడుతున్నాం.
- ఏవీ రాఘవరెడ్డి, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ, నంద్యాల
నోటీసులు జారీ చేశాం:
కోళ్ల వ్యర్థాలతో చేపలు సాగు చేయడం చట్టరీత్యా నేరం. గడిగరేవుల చేపల చెరువుల యజమానులకు నోటీసులు జారీ చేశాం. కోళ్ల వ్యర్థాలను వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
-వెంకటరమణ, తహసీల్దార్, గడివేముల