చేనేతపురి శివమయం
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:00 AM
ఎమ్మిగనూరు పట్టణ ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి రథోత్సవంతో చేనేతపురి శివ నామస్మరణతో మారుమోగింది.

ఉత్సాహంగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ప్రముఖుల హాజరు
ఎమ్మిగనూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణ ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి రథోత్సవంతో చేనేతపురి శివ నామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులతో పురవీధులన్నీ కిక్కిరిసి కనిపించాయి. ప్రజలు నీలకంఠేశ్వరస్వామి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. యువకులు కోలహలంగా జాతరలో సందడి చేశారు. పట్టణ ప్రము ఖులు, రాజకీయ నాయకులు స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మిగనూరు శ్రీనీలకంఠేశ్వర స్వామి మహా రథోత్సవంలో ఈ ఏడాది డ్రోనతో కురిపించిన రంగు రంగుల కాగితాల వర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహారథోత్సవం ప్రారంభం కాగానే ఆలయ నిర్వాహకులు ఆకాశం నుండి డ్రోన సహా యంతో పలుమార్లు గాలిలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరు గుతూ చిన్నపాటి రంగురంగుల కాగితాలను రథోత్సవంపై చల్లించారు. దీంతో భక్తులు కేరింతలు కొడుతూ హరహరమహాదేవ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
రథోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు.. నీలకంఠేశ్వరస్వామి రథోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి, మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి, ఆలూరు టీడీపీ ఇనచార్జి వీరభద్రగౌడ్, మాజీ ఎంపీ బుట్టారేణుక, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్మోహనరెడ్డి, రాజీవ్‌రెడ్డి, వీరశైవ లింగాయత కార్పొరేషన మాజీ చైర్మన వై.రుద్రగౌడ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, నరవ రమాకాంతరెడ్డి, తెలుగుయువ జిల్లాకార్యదర్శి దివాకర్ రెడ్డి, ఎంజీ కుటుంబీకులు, టీడీపీ బీసీసెల్ కార్యదర్శి మాచాని సోమునాథ్, ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు మాచాని శివశంకర్, ఎంపీపీ కేశన్న, ఆదోని ఇనచార్జి సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, కమీషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శేషఫణి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు పర్యవేక్షణలో సీఐలు శ్రీనివాసులు, బీ.వీ మధుసుదనరావు, ఎస్‌ఐలు డాక్టర్ నాయక్, కె.శ్రీనివాసుల ఆద్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
పోలీసులకు, ఎంపీపీకి మధ్య తోపులాట: ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా తేరుబజారులో రథోత్సవం దగ్గరకు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్మోహనరెడ్డితో పాటు ఎమ్మిగ నూరు మండల ఎంపీపీ గొల్ల కేశన్నమరికొంతమంది కార్యకర్తలు బయల్దేరి వెళ్లారు. అయితే, రథోత్సవం దగ్గరకు వెళ్లగానే వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని మాత్రమే రథోత్సవం జరిగే ప్రాంతానికి పోలీసులు అనుమతించారు. వెనుకనే ఉన్న ఎమ్మిగనూరు మండల ఎంపీపీ గొల్ల కేశన్నను పోలీసులు అడ్డుకున్నారు. తాను ఎంపీపీ అని చెప్పినప్పటికి నీవెవరైతే మాకేంటి అంటూ వెనక్కి నెట్టడంతో ఎంపీపీ కేశన్న కిందపడ్డాడు. దీంతో పక్కన ఉన్న కార్యకర్తలు, ఎంపీపీ కేశన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రథోత్సవం దగ్గరకు వెళ్లేందుకు అనుమతించాలని..ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. అయితే అప్పటికే రథోత్సవం దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారని పక్క నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో ఓ పోలీసు అధికారి కలుగజేసుకొని ఇరువురికి సర్దిచెప్పి ఎంపీపీ కేశన్నతో పాటు ఒకరిద్దరు కార్యకర్తలను మాత్రమే లోపలికి పంపారు.