Share News

శాపంగా మారిన సిమెంట్‌ లైనింగ్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:23 AM

గత వైసీపీ ప్రభుత్వంలో కమీషన్ల కోసమే గాలేరు-నగరి కాల్వకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేశారని బనగానపల్లె ప్రాంత ప్రజలు అక్రోశిస్తున్నారు.

శాపంగా మారిన సిమెంట్‌ లైనింగ్‌
గాలేరు నగరి కాల్వకు చేసిన సిమెంట్‌ లైనింగ్‌

బోర్లలో తగ్గిన భూగర్భ జలాలు

రైతుల నోట్లో మట్టి

కమీషన్ల కోసమే సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేసిన గత ప్రభుత్వం

గత వైసీపీ ప్రభుత్వంలో కమీషన్ల కోసమే గాలేరు-నగరి కాల్వకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేశారని బనగానపల్లె ప్రాంత ప్రజలు అక్రోశిస్తున్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు స్వలాభం కోసం ఈ లైనింగ్‌ పనులతో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా చేసి తమకు నష్టం చేశారని రైతులు విమర్శిస్తున్నారు.

బనగానపల్లె, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గాలేరి-నగరి కాల్వ పనులకు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. కృష్టానది వరదనీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈ పథకాన్ని అప్పటి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ప్రారంభించి పనులు పూర్తి చేశాయి. 1988లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పనులు 2005 నుంచి ప్రారంభం అయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టులోని 38 టీఎంసీల మిగులు జలాలను 30 రోజుల్లో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ ద్వారా తీసుకొని రాయలసీమలోని 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రాయలసీమ జిల్లాలకు తోడు నెల్లూరు జిల్లాను కూడా చేర్చి మరో 2.14 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని విస్తరించారు. మొత్తం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు 4.79 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే 10 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు గాలేరు నగరి పథకానికి విస్తరించారు.

సిమెంట్‌ లైనింగ్‌ పనులతో నష్టపోయిన రైతులు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గాలేరు నగరి మట్టికట్ట స్థానంలో ఇరువైపులా, కిందా సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయించారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ నుంచి గండికోట మీదుగా త్వరగా కడప జిల్లాకు నీరు తరలించేందుకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేశారు. 2021లో గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ సమీపంలోని గాలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వరకు 57 కిలోమీటర్ల వరకు మట్టికట్టతో ఉన్న గాలేరు నగరి కాల్వకు సిమెంట్‌ లైనింగ్‌ పనులకు టెండర్లు పిలిచారు. డీఎస్‌ఆర్‌, వీఏఆర్‌కెఎస్‌ కంపెనీలు జాయింట్‌ వెంచర్‌తో 57 కిలోమీటర్లకు 915 కోట్లతో టెండర్లను 2021 పిబ్రవరి నెలలో దక్కించుకొని సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తి చేశాయి.

మట్టికట్టతో పెరిగిన భూగర్భ జలాలు

గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు 57 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి రైతులకు సాగు, తాగు నీరును అందిస్తున్నారు. గాలేరు నగరి మట్టి కట్ట నిర్మాణం వల్ల పాణ్యం, బనగానపల్లె, అవుకు, సంజామల మండలాల్లోని పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల్లో నీరు పెరిగి రైతులు రెండుసార్లు పంటలు పండించుకోవలనే ఉద్దేశంతో మట్టికట్టతో గాలేరు నగరి పనులు పూర్తి చేశారు.

అడుగంటిన భూగర్భ జలాలు

పాణ్యం నుంచి బనగానపల్లె, అవుకు, సంజామల మండలం మీదుగా కడప జిల్లా దాకా గాలేరు నగరి కాల్వకు ఇరువైపులా, అడుగు భాగంలో సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయి. పాణ్యం, బనగానపల్లె , కోవెలకుంట్ల, అవుకు మండలాల్లోని వ్యవసాయ పొలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాకు సాగు, తాగునీరు మళ్లించేందుకు అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు తమ కమీషన్ల కోసం సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేపట్టి తమకు అన్యాయం చేశారని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. గతంలో అక్కడక్కడ గాలేరు నగరి కాల్వలో బోర్లు వేస్తామని మభ్యపెట్టారని, ఇంత వరకు ఎక్కడా బోర్లు వేయలేదని అంటున్నారు.

రైతులకు అన్యాయం

పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు మండలం అవుకు హెడ్‌ రెగ్యులేటర్‌ వరకు గాలేరు నగరి కాల్వకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయడం వల్ల మా ప్రాంత రైతులకు అన్యాయం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు త్వరగా వరద నీరు తీసికెళ్లడానికే ఈ పని చేసింది. భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయి వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తనుంది.

- బెడదల మహేశ్వరరెడ్డి, సర్పంచ్‌ పాతపాడు, బనగానపల్లె మండలం

భూగర్భ జలాలు తగ్గిపోయాయి

గాలేరు నగరి కాల్వలకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేపట్టడం దారుణం. ఈపనుల వల్ల ఈ పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లలో నీరు తగ్గుతోంది.

-దస్తగిరి, రైతు యాగంటిపల్లె, బనగానపల్లె మండలం

Updated Date - Jan 25 , 2025 | 12:23 AM