కర్నూలులో బర్డ్ ఫ్లూ
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:18 AM
రెండు రోజుల కిందట కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ కర్నూలు నగరంలో వ్యాపిస్తోందని గురువారం బయట పడింది.

ఎన్‌ఆర్ పేటలో పది కోళ్లు మృతి
రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు
కలెక్టర్ అత్యవసర సమావేశం
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల కిందట కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ కర్నూలు నగరంలో వ్యాపిస్తోందని గురువారం బయట పడింది. దీంతో నగరంలో కలకలం రేగింది. కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌పేటలో పది కోళ్లు మృతి చెందినట్లు పశుసంవర్ధ్దకశాఖ అధికారులు గుర్తించారు. మృతి చెందిన ఒక కోడి శాంపుల్స్‌ను ల్యాబ్‌లో నిర్దారణ కోసం పంపించగా.. పాజిటివ్ రావడంతో వెంటనే ఎన్‌ఆర్ పేటలో రెడ్‌జోన్‌గా ప్రకటించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మృతి చెందిన 9 కోళ్లను బయటి ప్రదేశాలకు తరలించి గుంత తీసి పూడ్చినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ శ్రీనివాస్ రాత్రి 8 గంటల సమయంలో తెలియజేశారు. కలెక్టర్‌కు ముందస్తు సమాచారం అందించడంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎన్‌ఆర్ పేటకు కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ హెచ్చరికలు అమలులో ఉంటాయని, కోళ్లను, గుడ్లను వ్యాపారుల అమ్మకుండా నిషేధం విధించాలని కలెక్టర్ రంజిత్ బాషా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పది కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం నుంచి మొదలు పెట్టి సర్వే పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జేడీ తెలిపారు. శుక్రవారం ఎన్‌ఆర్ పేట కాలనీల్లో తమ అధికారులు, సిబ్బంది కోళ్ల దుకాణాలను పర్యవేక్షిస్తారని బర్డ్ ఫ్లూ తీవ్రతపై పరీక్షలు నిర్వహిస్తారని జేడీ తెలిపారు. పంచలింగాలతో పాటు ఆదోనిలో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, బయటి ప్రాంతం నుంచి కోళ్లు రాకుండా చర్యలు చేపట్టినట్లు జేడీ శ్రీనివాస్ తెలిపారు.