Share News

అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:08 AM

పిల్లల పండుగ బాలోత్సవం గురువారం కర్నూలు శివారులోని మాంటిస్సోరి ఇండస్‌ పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయాలి

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పిల్లల పండుగ బాలోత్సవం గురువారం కర్నూలు శివారులోని మాంటిస్సోరి ఇండస్‌ పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ రంజిత్‌ బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాలలోని కళ్యాణమ్మ వేదికపై జరిగిన ఈ కార్యక్రమానికి బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు, రవీంద్ర విద్యాసంస్థల ఫౌండర్‌ జి.పుల్లయ్య, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్‌ రాజశేఖర్‌, బాలోత్సవం అధ్యక్షుడు బేసాహేబ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూడాలన్నారు. తాను పాఠశాలలో మోనో యాక్షన్‌లో ఇన్స్‌పెక్టర్‌ రంజిత్‌ డైలాగులు చెప్పేవాడినని, అందుకే తన పేరు కూడా రంజిత్‌గా మారిందన్నారు. పిల్లలోని వారి నైపుణ్యం చూడడం వల్ల ఒక మంచి పేరు వస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. డీఈవో శామ్యూల్‌ పాల్‌ మాట్లాడుతూ ఇది పిల్లలకు ఒక పండుగ అని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మంచి వేదిక అని వివరించారు. విద్యతో పాటు అన్ని కలిసి ఉన్నప్పుడే విద్యార్థి సమగ్రంగా అభివృద్ధి చెందుతారన్నారు. బాలోత్సవ కమిటి రాష్ట్ర నాయకులు రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 పట్టణాల్లో బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కులకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పోటీల ద్వారా పిల్లల్లో మానసిక పెరుగుదల ఉంటుందన్నారు. మొదటి రోజు 22 రకాల సాంస్కృతిక అకడమిక్‌ పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ నృత్యం, సంప్రదాయ నృత్యాలు, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం, గీతాలాపన పోటీలు నిర్వహించారు. 57 పాఠశాలల నుంచి 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటి సభ్యులు ఎల్లగౌడు, క్లస్టర్‌ యూనివర్సిటీ డీన్‌ డాక్టర్‌ అక్తర్‌భాను, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పీబీవీ సుబ్బయ్య, బాలోత్సవం కన్వీనర్‌ ధనుంజయ, ప్రధాన కార్యదర్శి జేఎన్‌ శేషయ్య, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:08 AM