మున్సిపల్ కౌన్సిల్ మీట్ రసాభాస
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:20 AM
ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళంగా మారింది.
ఎమ్మిగనూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళంగా మారింది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో.. ఎందుకు వాగ్వాదం చేసుకుంటున్నారో.. తెలియక సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ రఘు అర్ధాంతరంగా ముగించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం చైర్మన్ రఘు అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ మాట్లాడుతూ సమావేశాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మాణాలు చేస్తున్నామని, అయితే అవి టెండర్ దశకు రాకపోగా పనులు జరగటం లేదన్నారు. కాంట్రాక్టర్లకు రూ. 5 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మున్సిపల్ న్యాయ సలహాదారుడిగా న్యాయవాది గురురాజును ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని వైసీపీకి చెందిన కౌన్సిలర్ల సంతకాలతో కూడిన తీర్మాణాన్ని చైర్మన్‌కు అందజేశారు. అనంతరం కూటమి పార్టీలకు చెందిన సభ్యులు అమాన్, ఇసాక్, వాహీద్‌తో పాటు దయాసాగర్ వైస్‌చైర్మన్ ఆరోపణలను అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగిందన్నారు. బిల్లులు రావాల్సింది వాస్తవమేనని, అవి త్వరలో విడుదులవుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టి పనులు జరగలేదని ఆరోపించారు. దీంతో వైస్ చైర్మన్ నజీర్ కలుగజేసుకోవడంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్ రఘు కలుగచేసుకొని ఇరువురిని శాంతింపజేశారు. ఒకటో వార్డు కౌన్సిలర్ నాగేశప్ప మాట్లాడుతూ జోగి కాలనీలో 13 నెలల క్రితం పనులకు భూమి పూజ చేశారని, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని, అలాగే ఒకటో వార్డులో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. 28వ వార్డు కౌన్సిలర్ బజారి మట్లాడుతూ తమ వార్డులో తాగునీటి సమస్యపై పూర్తి స్థాయి వివరాలు అందజేసినా పట్టించుకోవటం లేదన్నారు. కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ వార్డులో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లు, డ్రైనేజీల పనులు జరిగాయన్నారు. అభివృద్ధి జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఇందుకు కౌన్సిలర్ బజారి ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏంటో అందరికీ తెలుసునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, మీ వార్డులో సమస్యలు చెప్పాలని అడ్డుతగిలారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ. 5.60 కోట్లతో పనులు పూర్తి అయ్యాయని, 15వ ఆర్థికం సంఘం నిధులతో కూడా పనులు చేపడుతున్నామని తెలిపారు. తిరుమల నగర్‌లో కూడా రూ.38 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్‌ల పనులు ప్రారంభించామని, వచ్చేనెలలో పూర్తి చేస్తామని చెప్పారు. వెంకటాపురం కాలనీలో కూడా రూ. 50 లక్షలో అభివృద్ధి పనలు చేపట్టామని చెప్పుకొస్తుండగా ఆ వార్డు కౌన్సిలర్ బజారి అభ్యంతరం తెలిపారు. రెండేళ్లుగా తాగునీటి సమస్య ఉందని చెబుతున్నా.. ఏమాత్రం పట్టించుకోవటం లేదని కమిషనర్‌పై మండిపడ్డారు. అనంతరం 22వ వార్డు కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ చైర్మన్ వార్డులో కూడా నీరు నిలిచాయని చెప్పుకొస్తుండగా.. చైర్మన్ స్పందిస్తూ.. మీ వార్డు గురించి మాట్లాడండి.. ఇతర వార్డుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?, మీరేమైన ఫ్లోర్ లీడరా? అని మాట్లాడడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దయాసాగర్‌కు మద్దతుగా టీడీపీ సభ్యులు, చైర్మన్‌కు మద్దతుగా వైసీపీ సభ్యులు గొంతు కలిపారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ బెల్ కొట్టి అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి వెల్లిపోయారు. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ దివ్యకళ, డీఈ నీరజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.