Share News

పారిశ్రామికంగా మరో అడుగు..!

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:49 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి.

 పారిశ్రామికంగా మరో అడుగు..!

ఏపీఐఐసీకి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అడుగులు

ఓర్వకల్లు కేంద్రంగా ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహన పార్క్‌ ఏర్పాటు

కర్నూలు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐసీడీసీ)-స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కు ఏపీఐఐసీ నుంచి 2,621,15 ఎకరాలు బదిలీ చేసేందుకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇస్తూ శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వివిధ పరిశ్రమలు ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే.. దేశంలోనే ప్రప్రథమ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పార్క్‌ - ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ స్థాపనకు పీపుల్‌ టెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చింది. రూ.1,800 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేసే ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ కోసం రాష్ట్ర మానన వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ సమక్షంలో పీపుల్‌ టెక్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామిక పురోగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి.

స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు

ఓర్వకల్లు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌-2024-25 సందర్భంగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నెల రోజులకే నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా దేశంలో 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫేజ్‌-1 కింద రూ.2.786 కోట్లతో 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీగా అభివృద్ధికి డిజైన్‌ చేశారు. రోడ్లు, నీరు, రవాణా, విద్యుత్‌.. వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తే.. నాన్‌ మెటలిక్‌ మినరల్‌ పరిశ్రమలు, ఆటోమొబైల్‌ రంగం విడిభాగాల తయరీ, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హార్డ్‌వేర్‌, ఫార్మాస్యూటికల్స్‌, వజ్రాలు, బంగారు అభరణాల తయారీ, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీడీసీ) ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఆయా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, తద్వారా 45,071 మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే అవసరమైన భూములను కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తాజాగా ఓర్వకల్లు మండలం మీదివేముల, ఉప్పలపాడు, ఎన్‌. కొంతలపాడు గ్రామాల్లో ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐసీడీసీ)-స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కు 2,621.15 ఎకరాలు బదిలీ చేసేందుకు ఏపీఐఐసీకు అవసరమైన సేల్‌ డీడ్‌ ఎగ్జిక్యూషన్‌ కోసం ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌ -1899, సెక్షన్‌ 9(1)(ఏ) కింద స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చట్టం-1908 సెక్షన్‌ 78 కింద రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీఐసీడీసీకి ఏపీఐఐసీ భూములు బదిలీ చేయగానే కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.2.786 కోట్లతో మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అదే జరిగితే స్థానికులు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.

ఓర్వకల్లు కేంద్రంగా దేశంలో ప్రథమ ఎలక్ట్రిక్‌ వాహన పార్క్‌

ఓర్వకల్లు కేంద్రంగా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహన పార్క్‌-ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయడానికి పీపుల్‌ టెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చింది. శుక్రవారం రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ సమక్షంలో పీపుల్‌ టెక్‌ గ్రూప్‌ సీఈవో టీజీ విశ్వప్రసాద్‌, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సాయికాంత్‌వర్మ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ పత్రాలను మార్చుకున్నారు. ఈ సంస్థ ఓర్వకల్లు కేంద్రంగా 1,200 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ వాహన పార్క్‌-ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ స్థాపించనుంది. ఇది దేశంలోనే ప్రప్రథమ ప్రాజెక్టు అని తెలిపారు. ఈ వ్యాలీ రూ.1,800 కోట్లతో అభివృద్ధి చేస్తారు. రూ.13 వేల కోట్లు పెట్టుబడులు రాబట్టడంతో పాటు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. ఇందులో యాంకర్‌ యూనిట్‌గా పీపుల్‌ టెక్‌ గ్రూప్‌ రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ (ఈ2డబ్ల్యూ) తయారీ యూనిట్‌ను స్థాపిస్తారు. ఆర్‌ అండ్‌ డి సెంటర్లు, టెస్టింగ్‌ ట్రాక్‌లు, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ స్పేసెస్‌, పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు సహా హౌసింగ్‌, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, మాల్స్‌ వంటి సామాజిక మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నారు. పీపుల్‌ టెక్‌ గ్రూప్‌ సీఈవో టీజీ విశ్వప్రసాద్‌, ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ-ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహన పార్క్‌ దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలుస్తుందని అన్నారు.

14 వేల కోట్లతో ఓర్వకల్లులో సెమి కండక్టర్‌ పరిశ్రమ

ఇటీవలే రూ.14 వేల కోట్లతో దేశంలోనే ప్రప్రథమంగా ఓర్వకల్లులో సెమి కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నాం. తాజాగా దేశంలోనే తొలి ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) పార్క్‌-ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు పీపుల్‌ టెక్‌ గ్రూప్‌ ముందుకు రావడం అభినందనీయం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రైవేట్‌ ఈవీ పార్క్‌ను ఓర్వకల్లు కేంద్రంగా ఏర్పాటు చేద్దామని అడుగానే ఒప్పకోవడం అభినందనీయం అన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విప్లవంలో ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ అగ్రస్థానంలో నిలుస్తుంది.

- టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

Updated Date - Jan 17 , 2025 | 11:49 PM